వ్యక్తిగతంగా డ్రోన్ల వాడకం ఖచ్చితంగా నేరమే : తేల్చి చెప్పిన ప్రభుత్వం

By రాణి  Published on  1 Feb 2020 9:17 AM GMT
వ్యక్తిగతంగా డ్రోన్ల వాడకం ఖచ్చితంగా నేరమే : తేల్చి చెప్పిన ప్రభుత్వం

ముఖ్యాంశాలు

  • వ్యవసాయం కోసం డ్రోన్ల వినియోగంపై పెరుగుతున్న అవగాహన
  • విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్న ఆదర్శ రైతు నర్సింహారెడ్డి
  • చేసిన ప్రయోగాల ఫలితాలను వివరిస్తూ ప్రభుత్వానికి లేఖ
  • నర్సింహారెడ్డికి తిరుగు టపాలో ప్రభుత్వ అదనపు కార్యదర్శి సమాధానం
  • వ్యక్తిగతంగా డ్రోన్ల వాడకం నిషేధమని ఉద్భోద
  • కలగబోయే విపరీతమైన పరిణామాల గురించి హెచ్చరిక

టెక్నాలజీ అనే కత్తికి రెండువైపులా పదునుంటుంది. అధికారం అనే కత్తికూడా అచ్చం అలాంటిదే. టెక్నాలజీ ఎప్పుడు పనికొస్తుందో ఎప్పుడు విపరీత పరిణామాలకు దారితీస్తుందో చెప్పడం కష్టం. అలాగే అధికారులు ఎప్పుడు దేనికి ఎందుకు అనుగ్రహిస్తారో, ఎప్పడు ఎక్కడ, ఎందుకు, దేనికి ఆగ్రహిస్తారో కూడా తెలియదు. సరిగ్గా వ్యవసాయ భూముల్లో డ్రోన్ల సాయంతో పురుగుమందుల్ని స్ప్రే చేసిన విషయాన్ని రైతులు కేంద్ర ప్రభుత్వానికి తెలిపి దాన్ని మరింత ప్రోత్సహించాలని కోరారు.

ముఖ్యంగా ఈ విషయంలో ఎంతో చొరవ చూపించిన తెలంగాణ రైతు దొంతి నర్సింహారెడ్డి డ్రోన్లసాయంతో తాము ఎలా పురుగు మందులను పిచికారీ చేయగలిగారో, ఏ విధంగా దానివల్ల లాభాలు కలిగాయో, ఏ విధంగా మిగతా రైతులందరూ దాన్ని ప్రేరణగా తేసుకుని వాళ్ల పొలాల్లోనూ డ్రోన్ల సాయంతో పురుగు మందులు చల్లుతున్నారో, ఎంతగా కష్టాన్ని తగ్గించుకోగలుగుతున్నారో మొదలైన వివరాన్నింటినీ పూర్తిగా తెలుపుతూ వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి రాజేష్ వర్మకు లేఖ రాశారు. ఆయన వెంటనే దానికి బదులిస్తూ బోలెడన్ని జాగ్రత్తలు చెపుతూ మళ్లీ తిరిగి రైతు నర్సింహారెడ్డికి మరో లేఖ రాశారు.

కొత్త అనారోగ్య సమస్యలొస్తాయ్

“చట్టపరంగా డ్రోన్ల వినియోగం అనుమతిలేనిదే కూడని పని. పై నుంచి ఎత్తులో ఉన్న డ్రోన్ల ద్వారా పురుగుమందుల్ని పిచికారీ చేసినప్పుడు ఆ మందు సరిగ్గా ఖచ్చితంగా పురుగులమీద పడుతుందన్న గ్యారంటీ లేదు. పైగా వాతావరణం బాగుండకపోతే పిచికారీ చేయాల్సిన మందంతా పూర్తిగా గాలికి కొట్టుకుపోతుంది. దానివల్ల రెండు విధాలుగా నష్టం జరుగుతుంది. ఒకటి ఆశించిన రీతిలో పంటకు మందు అందదు. రెండోది గాలి వాటానికి చాలా దూరం కొట్టుకెళ్లి అనవసరంగా గాలిని కలుషితం చేసేస్తుంది ఆ మందు. దానివల్ల దరిదాపుల్లో ఉన్న గ్రామాల ప్రజలకు కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇన్ సెక్టిసైడ్ యాక్ట్ ఇలా పురుగు మందుల్ని డ్రోన్ల ద్వారా స్ర్పే చేయడానికి అంగీకరించదు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ లాంటి ప్రయోగాలు చేయకుండా ఉండడమే మంచిది. వాటిని ప్రోత్సహించక పోవడమే మంచిది. నలుగురికీ మంచి చేయాలన్న మీ ఆలోచన చాలా మంచిదే. కానీ మంచి చేస్తున్నాననుకుని భ్రమపడి చివరికి చేటు తెచ్చే ప్రమాదాన్ని మీరు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే అలా అధికారికంగా అనుమతిలేని ఇలాంటి చర్యల్ని వెంటనే ఆపేయండి” అంటూ ప్రభుత్వ అదనపు కార్యదర్శి రైతు నర్సింహారెడ్డికి రాసిన లేఖలో ప్రస్తావించారు.

మెప్పుకోసం లేఖరాస్తే, ప్రచారం కల్పించమని అభ్యర్థిస్తే ఇలా కథ ఉన్నపళంగా అడ్డం తిరిగిందేంటబ్బా అని రైతు నర్సింహారెడ్డి హతాశుడయ్యారు. కొండనాలిక్కి మందేస్తే అన్న నాలిక ఊడిపోయినట్టు పరిస్థితి ఇలా మారిపోయిందేంటా అని తలపట్టుక్కూర్చున్నారు. నిజానికి గతంలో కేరళలో ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడో జరగాయని, వాటివల్ల చాలా నష్టాలు ఉండడంతో తీవ్రపరిణామాలనుంచి తప్పించుకోవడానికి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందన్న విషయాన్ని ప్రభుత్వ అదనపు కార్యదర్శి తను రాసిన లేఖలో ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది.

Next Story