తెలంగాణ నుంచి రాజ్యసభకు మాజీ ఎంపీ, తెరాస నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖరారైనట్లు, ఆ మేరకు సీఎం కేసీఆర్‌ నుంచి పొంగులేటికి ఫోన్‌ వెళ్లినట్లు మంగళవారం విస్తృత ప్రచారం జరిగింది. దీంతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. ఇదంతా అవాస్తవమని తేల్చిచెప్పారు. తనకు రాజ్యసభ టికెట్‌ కేటాయింపుపై అధిష్టానం నుంచి ఎలాంటి పిలుపు రాలేదని తెలిపారు. రాజ్యసభ సీటు విషయంలో పార్టీ అధినేత నిర్ణయమే ఫైనల్‌ అని స్పష్టం చేశారు.

అధిష్టానం నుంచి నాకు ఫోన్‌ వచ్చినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటితో తనకు సంబంధం లేదని అన్నారు. బుధవారం పొంగులేటి మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ఆయన్ను రాజ్యసభ స్థానం ఖరారుపై ప్రశ్నించగా పై విధంగా స్పందించారు. ఇదిలా ఉంటే తెరాసకు రెండు రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు స్థానాలకు పలు పేర్లను సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు.

వీరిలో ప్రస్తుత ఎంపీ కే. కేశవరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కవిత, బి. వినోద్‌ కుమార్‌, నాయిని నర్సింహారెడ్డి,  సీతారాం నాయక్‌తో పాటు పలువురి పేర్లుప్రచారంలో ఉన్నాయి. కే. కేశవరావుకు రాజ్యసభ సీటు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటుండగా రెండవ స్థానంలో రాజ్యసభకు ఎవరిని పంపిస్తారనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెల 13తో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.