పట్టించుకోని ప్రభుత్వం.. 33వ రోజుకు చేరిన సమ్మె..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2019 1:16 PM GMT
పట్టించుకోని ప్రభుత్వం.. 33వ రోజుకు చేరిన సమ్మె..!

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 33వ రోజుకు చేరుకుంది. అన్ని జిల్లాల్లోను కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెను తీవ్రతరం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ విధించిన డెడ్‌లైన్‌ను లెక్క చేయకుండా ఆర్టీసీ కార్మికులు తమ సమ్మె కొనసాగిస్తున్నారు. ఇవాళ అన్ని డిపోల ముందు కార్మికులు నిరాహార దీక్షలు చేపట్టారు. డిపోల ముందు ధర్నాకు దిగిన కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు కాలేజీలకు వెళ్లేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో బస్సుల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రమాదకరమైన స్థితిలో విద్యార్థులు చేస్తున్న ప్రయాణం చూస్తే.. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చర్చలు జరిపే వరకు సమ్మె కొనసాగుతుంది: అశ్వత్థామరెడ్డి

మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఈ నెల 9వ తేదీన జరిగే మిలియన్‌ మార్చ్‌కు కార్మిక నేతలు మద్దతు కోరారు. మిలియన్‌ మార్చ్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. చర్చల ప్రక్రియను ప్రారంభించాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. చర్చలు జరిపే వరకు సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి తెలిపారు. చర్చలకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు.

అమిత్‌షా, నడ్డాకు ఆర్టీసీ డిమాండ్లపై వివరించాం: కె.లక్ష్మణ్‌

ప్రభుత్వానికి ఆర్టీసీ సమ్మెను ముగించే ఆలోచనే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. మూడుసార్లు డెడ్‌లైన్‌ విధించినా 300 మంది కూడా విధుల్లో చేరలేదన్నారు. సీఎం మాటలు కార్మికులు వినలేదు.. కేసీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అమిత్‌ షా, నడ్డాకు ఆర్టీసీ డిమాండ్లను వివరించామని కె.లక్ష్మణ్‌ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశామన్నారు. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన మిలియన్‌ మార్చ్‌కు పూర్తి మద్దుతు తెలుపుతున్నామని కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

రేపు హైకోర్టులో విచారణ

ఇదిలా ఉంటే.. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ ఇంచార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. ఆర్టీసీ సమ్మెపై రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Next Story