ఇక చలో బ్రిటన్.!

By అంజి  Published on  29 Jan 2020 9:38 AM GMT
ఇక చలో బ్రిటన్.!

లండన్ : “ప్రయాసపడి అమెరికా పోలేక శ్రమించుచున్న వారలారా... మా యొద్దకు రండు... మీము మీకు విశ్రాంతి కలుగచేతుము” అంటోంది బ్రిటన్. ప్రపంచమంతటా ఉన్న ఉత్తమ శాస్త్రవేత్తలను, సాంకేతిక నిపుణులకు, గణిత నిపుణులను ఇప్పుడు బ్రిటన్ ఎర్ర తివాచీ పరుస్తోంది. దీని కోసం “అన్ లిమిటెడ్” వీసా విధానాన్ని ఫిబ్రవరి నుంచి అమలు చేయనుంది. ఇందులో వీసాలు జారీ చేయడం విషయంలో సంఖ్యాపరమైన పరిమితులుండవు. అంటే ఎంతమందైనా రావచ్చు.

“ఒకప్పుడు మేము శాస్త్ర సాంకేతిక రంగాల్లో, అన్వేషణలవీసా విధాకు, పరిశోధనలకు పెట్టింది పేరుగా ఉండేవాళ్లం. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయికి చేరుకునేందుకు మేము ప్రపంచంలో ఉన్న ప్రతిభకు స్వాగతం పలుకుతున్నాం. వారు ఇక్కడికి రావచ్చు” అని బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. నిజానికి ఎన్నికల సమయంలో తాను బ్రిటన్ ను శాస్త్ర సాంకేతిక రంగాల నిపుణులను ఆకట్టుకునే ఒక అద్భుతమైన అయస్కాంతంగా మారుస్తానని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.

నిజానికి కెమిస్ట్రీలో నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ చాలా కాలంగా ఇలాంటి సరళీకృత విధానం కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. యురె రాయల్ సొసైటీ అధ్యక్షుడి హోదాలో ఆయన చాలా కాలంగా బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ దిశగా ప్రతిపాదనలు పంపుతూ వచ్చారు. బ్రిటన్ బ్రెక్సిట్ లో భాగంగా యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తరువాత మేథావులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా తన తలుపులు తెరవాలని నిర్ణయించుకుంది. ఈ ఫాస్ట్ ట్రాకింగ్ లో బాగంగా, అమెరికాకు చెందిన ప్రాజెక్టులను బ్రిటన్ కు మరలించడం, అదే విధంగా భారతీయ ప్రతిభను ఆహ్వానించడం కోసం బ్రిటన్ ప్రయత్నాలు చేస్తోంది.

ఇది వరకు బ్రిటన్ లోకి రావడానికి శాస్త్రవేత్తలకు ఉద్యోగంలో అపాయింట్ మెంట్ లెటర్ ఉండటం తప్పనిసరి. ఇప్పుడు ఆ అవసరం లేకుండానే నేరుగా అప్లై చేసుకునే విధానం అమలులోకి రానుంది. వారి పరిశోధనల నిమిత్తం దేశం వదిలి బయటకు తాత్కాలికంగా వెళ్లాల్సి రావడం పైనా పలు ఆంక్షలుండేవి. ఇప్పుడు వాటిని కూడా తొలగించబోతున్నారు. కాబట్టి “చలో బ్రిటన్!!” అంటూ మన శాస్త్రవేత్తలు విమానం ఎక్కేయవచ్చు.

Next Story