బ్రేకింగ్‌: సైనికుడి కాల్పులు.. 20 మంది మృతి..!

By సుభాష్  Published on  8 Feb 2020 4:22 PM GMT
బ్రేకింగ్‌: సైనికుడి కాల్పులు.. 20 మంది మృతి..!

థాయ్‌లాండ్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. కోరట్‌లో జనంపై ఓ సైనికుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 'జక్రఫంత్‌ థోమా' అనే ఓ జూనియర్‌ ఆఫీసర్‌ మిలటరీ క్యాంప్‌ నుంచి తుపాకీని దొంగిలించి తన కమాండింగ్‌ కార్యాలయంపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తి షాపింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లోనే దాక్కుని ఉన్నట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. సిటీ సెంటర్‌ అన్ని వైపులా ఉన్న ద్వారాలను మూసివేసినట్లు తెలుస్తోంది. కాల్పుల నేపథ్యంలో చుట్టుపక్కల వారు బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు సూచించారు.

కాగా, దాడి జరుగుతున్న సమయంలో అనుమానితుడు తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో 'నేను లొంగిపోవచ్చా' అంటూ పోస్టు చేసినట్లు సమాచారం. అంతేకాదు అంతకు ముందు ఒక పిస్టల్‌, మూడు బుల్లెట్లు ఉన్న ఫోటోలను కూడా పోస్టు చేసినట్లు తెలుస్తోంది.

సైనికుడు కాల్పులకు ఎందుకు పాల్పడ్డాడో తెలియడం లేదని, అతనికి మానసికస్థితి సరిగ్గా లేదని తెలుస్తోందని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి కొంగ్చీప్‌ తంత్రవానిట్‌ మీడియాకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story