ఈ నత్తలను పెంచితే టేస్టీ టేస్టీ కాఫీ దొరుకుతుంది
By సుభాష్ Published on 13 March 2020 4:24 PM ISTమనం తాగే మాంచి కాఫీకి... నత్తలకు సంబంధం ఉందన్న సంగతి మీకు తెలుసా? అవునండీ... ఏషియన్ ట్రాంప్ స్నెయిల్ అనే ఒక జాతి నత్త భలే పవర్ ఫుల్. దానికి బోలెడంత ఆకలి. దాని ఫేవరిట్ ఫుడ్ కాఫీ ఆకులను ఆశించే ఒక జాతి ఫంగస్. ఆ ఫంగస్ కనిపించిందంటే చాలు, మాంచి భోజనం లభించిందని ఈ నత్త నోటికి పని చెబుతుంది. కాఫీ ఆకులను బలహీనపరిచి, కాఫీ విత్తనాల నాణ్యతను దెబ్బ తీసే ఈ ఫంగస్ ను తినేస్తుంది. ఈ ఫంగస్ వల్ల విత్తనాలకు సరైన పోషకాలు అందకుండా పోతాయి. విత్తనాల నాణ్యత దెబ్బ తింటుంది.
చిన్న చిన్న కాఫీ తోటల యజమానులు ఈ ఫంగస్ ను అరికట్ట లేక ఏకంగా ప్లాంటేషన్లను తగులబెట్టేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాఫీ గింజల దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతోంది. ఇటీవలే శాస్త్రవేత్తలు ఏషియన్ ట్రాంప్ స్నెయిల్ ఫంగస్ ను తినేస్తోందని కనుగొన్నారు. ఈ నత్తలు తిరుగాడే చోట ఉన్న కాఫీ మొక్కల విత్తనాల నాణ్యత బాగుందని వారు గుర్తించారు. ప్యుయెర్టో రైకో దేశంలో కాఫీ దిగుబడి బాగా ఉండటానికి ప్రధానకారణం ఆ ప్రాంతంలో ఈ నత్తల జనాభా ఎక్కువగా ఉండటమేనని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇంకో విశేషం ఏమిటంటే ఈ నత్తలు కేవలం ఫంగస్ ను మాత్రమే తింటాయి ఆకును ముట్టుకోవు. దీని వలన ఆకులు బాగా ఉండి, చీడ పీడల దాడులు తగ్గి, కాఫీ గింజకు తగినన్ని పోషకాలు అందుతాయి. ఫలితంగా గింజల నాణ్యత పెరుగుతుంది. ఇప్పుడు కాఫీ తోటలను పెంచే ప్రదేశాల్లో ఈ జాతి నత్తగుల్లను ప్రవేశపెట్టాలని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. చెత్తను తినేసి , ఆకులను కాపాడే ఈ నత్తలను కాఫీ తోటల్లో పెంచమని చెబుతున్నారు.