మార్కెట్లో పాపులర్ అయిన కొత్త తెలుగు టీ షర్ట్స్

By Newsmeter.Network  Published on  17 Jan 2020 3:24 PM IST
మార్కెట్లో పాపులర్ అయిన కొత్త తెలుగు టీ షర్ట్స్

  • వినూత్న ఆలోచనతో ఇద్దరు ఇంజినీర్ల కొత్త వ్యాపారం
  • టీ షర్ట్ లపై తెలుగు సినిమా పాపులర్ డైలాగులు
  • పంచ్ డైలాగుల్ని కాయిన్ చేసిన ప్రమోటర్లు
  • డెడ్డీ మాగ్ అనే పేరుతో విపరీతమైన పాపులారిటీ
  • టీ షర్ట్స్ మీద వైరల్ అయిన తెలుగు డైలాగుల ముద్రణ
  • కొత్త కాన్సెప్ట్ కి శ్రీకారం చుట్టిన ఇద్దరు తెలుగు ఇంజినీర్లు
  • తెలుగు హీరోలు సైతం ఫాలో అవుతున్న కొత్త ట్రెండ్

2017లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి కలసి ఓ ఇంగ్లిష్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన‌ విషయం తెలుగు సినిమా అభిమానులందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ మోహన్ బాబు డైలాగ్ డెలివరీని మెచ్చుకుంటూ పదే పదే పలు ప్రశ్నల్ని సంధించిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. తెలుగు డైలాగ్ పవర్ అలాంటిది మరి.

తెలుగు డైలాగ్స్ ని మరింతగా పాపులర్ చేసేందుకు హైదరాబాద్ కి చెందిన ఇంజినీర్లు వాసిరెడ్డి హరీష్ చౌదరి, మహిల్ ఇలింద్ర కాన్సెప్ట్ టీ షర్ట్స్ ని తయారు చేసి యూత్ మీదికి ఎక్కుపెట్టారు. కొత్తగా కాయిన్ చేసిన, బాగా పాపులర్ అయిన తెలుగు సినిమా డైలాగ్స్ ని టీ షర్టులమీద ముద్రించి యూత్ ని విపరీతంగా ఆకట్టుకునే ప్రయత్నాల్లో సూపర్ డూపర్ సక్సెస్ సాధించారు ఈ ఇద్దరు యువ ఇంజినీర్లు.

ఫసాక్ అనే డైలాగ్ ని మోహన్ బాబు చెప్పినంత తేలిగ్గా సరదాగా, స్పాంటేనియస్ గా చెప్పలేక పోయిన సర్దేశాయ్, అసలు ఆ పదాన్ని ఉచ్చరించడానికే యమయాతన పడ్డాడు. కానీ జనసామాన్యానికి మాత్రం అలాంటి పదాలు విపరీతంగా నచ్చేస్తాయి. ఆ సినిమా రిలీజైన తర్వాత ఫసాక్ అనే డైలాగ్ విపరీతంగా వైరల్ అయ్యింది. నిజానికి ఆ డైలాగ్ ని ఆ సినిమాలో లేపేయడం, గొంతు కోసేయడం, మర్డర్ చేయడం లాంటి అర్థాలు వచ్చేలా కాయిన్ చేశాడు దర్శకుడు.

ఒంగోలుకు చెందిన వాసిరెడ్డి హరీష్, ఖమ్మానికి చెందిన మహిల్ ఇల్లింద్ర సరిగ్గా ఆ లైన్ అండ్ లెంగ్త్ ని పట్టుకున్నారు. అలాంటి వెరైటీ డైలాగుల్ని టీషర్ట్ ల మీద ముద్రించే పని పెట్టుకున్నారు. తమ బ్రాండ్ కి వాళ్లు డెడ్డీ మాగ్ అనే పేరు పెట్టుకున్నారు. ఇప్పుడీ టీ షర్ట్ లు ఎంత పాపులర్ అయ్యాయంటే కొత్త సినిమాల్లో పలువురు హీరోలు ప్రత్యేకంగా ఈ టీ షర్ట్స్ ని ఎంపిక చేసుకుని మరీ ధరిస్తున్నారు.

నవతరం ఇంజినీర్ల కొత్త ట్రెండ్..

నిజానికి ఈ ఇంజినీర్లిద్దరూ మాతృభాషంటే పడి చచ్చిపోతారు. ఆ కారణంగా అసలు ప్రొఫెషన్ కంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథలు, మాటలు రాయడమే వీళ్లకు చాలా ఇష్టంగా మారిపోయింది. తర్వాత కొన్నాళ్లకు వీళ్లకి టీ షర్ట్ ల మీద తెలుగు సినిమా డైలాగ్స్ ని ముద్రిస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా వచ్చింది.

డిసెంబర్ 2018లో వీళ్లిద్దరూ డెడ్డీ మ్యాగ్ పేరుతో బ్రాండ్ నేమ్ ని ఫోకస్ చేస్తూ టీ షర్ట్ ని తయారీ కంపెనీని స్థాపించారు. సరిగ్గా ఏడాది తిరిగేసరికల్లా వీళ్లు స్థాపించిన కొత్త బ్రాండ్ మార్కెట్లో చాలా పాపులర్ అయ్యింది. ఎంత పాపులారిటీ అంటే యువహీరోలు సైతం వీళ్ల బ్రాండ్ అంటే పడి చచ్చిపోతున్నారు.

హీరోల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుకదా. ఈ టీ షర్ట్ లకోసం సామాన్యులు పిచ్చెక్కిపోతున్నారంటే నమ్మి తీరాల్సిందే. కేవలం రెండేళ్లలో రెండంటే రెండేళ్లలో వీళ్ల బ్రాండ్ యూత్ లో బాగా పాపులారిటీని సంపాదించుకోవడం విశేషం.

Next Story