‘బిగ్ బాస్’ షో విషయంలో ఎన్ని విమర్శలు, అభ్యంతరాలు ఉన్నప్పటికీ.. ఆ షోకు మంచి ఆదరణ ఉందన్నది వాస్తవం. వివిధ భాషల్లో ఆ షో విజయవంతంగా నడుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో మూడు సీజన్లూ విజయవంతం అయ్యాయి. కరోనా-లాక్ డౌన్ కారణంగా ఈసారి ‘బిగ్ బాస్’ ఉంటుందో లేదో అని సందేహాలు కలిగాయి కానీ.. వాటికి తెరదించుతూ నాలుగో సీజన్‌ను ప్రకటించారు. తెలుగులో తొలి మూడు సీజన్లకు ముగ్గురు హోస్ట్‌లు కనిపించారు. చివరగా షోను హోస్ట్ చేసిన నాగార్జునే వరుసగా రెండో సీజన్లోనూ ‘బిగ్ బాస్’ను నడిపించబోతున్నారు. ఐతే గత మూడు సీజన్లతో పోలిస్తే ఈసారి ‘బిగ్ బాస్’ మీద ప్రేక్షకుల్లో అంత ఆసక్తి అయితే కనిపించడం లేదు. సోషల్ మీడియాలో దీని గురించి అసలు చర్చే లేదు.
మామూలుగా అయితే ‘బిగ్ బాస్’ ఆరంభం కావడానికి ముందు పార్టిసిపెంట్ల గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తాయి. వాళ్ల గురించి డిస్కషన్లు నడుస్తాయి. కానీ పార్టిసిపెంట్ల గురించి కొన్ని ఊహాగానాలైతే నడిచాయి కానీ.. చర్చ అయితే పెద్దగా లేదు. ఇంకొక్క రోజులో షో ఆరంభం కాబోతుండగా కూడా ఎక్కడా చప్పుడు లేకపోవడాన్ని బట్టి ఈసారి షోకు హైప్ లేదని అర్థమవుతోంది. నిరుడు హోస్ట్‌గా నాగార్జునను పెట్టడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమైంది. స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది. ఈసారి హోస్ట్‌ను మార్చకపోవడం, నాగార్జుననే కొనసాగించడం ఆసక్తి తగ్గడానికి ఒక కారణం కావచ్చు. అలాగే జనాలు కరోనా తాలూకు భయాందోళనల్లో, బాధల్లో ఉన్నారు. మరోవైపు ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న పార్టిసిపెంట్ల పట్ల కూడా వారికి అంత ఆసక్తి కనిపించడం లేదు. ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే పేర్లయితే ఆ జాబితాల్లో లేవు. మొత్తంగా చూస్తే లో హైప్ మధ్య ఆదివారం ఈ షో ఆరంభం కాబోతోంది. మరి పార్టిసిపెంట్లు వెల్లడయ్యాక, తొలి ఎపిసోడ్ ఎలా నడుస్తుందన్నదాన్ని బట్టి అయినా నిర్వాహకులు ఆశించే హైప్ వస్తుందేమో చూడాలి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *