రేపు కేసీఆర్ ఇలాకాకు షర్మిల..అడ్డుకుంటామన్న బీఆర్ఎస్
వైఎస్ షర్మిల రేపు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 9:00 PM ISTరేపు కేసీఆర్ ఇలాకాకు షర్మిల..అడ్డుకుంటామన్న బీఆర్ఎస్
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామానికి వెళ్తారు. దళితబంధు పథకంలో అక్రమాలపై ప్రశ్నించాలని స్థానికుల నుంచి ఆహ్వానం రావడంతో.. ఆమె ఈ పర్యటనకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఈ వినతి పత్రాన్ని వైఎస్ షర్మిలకు జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామ వాసులే పంపారు.
కాగా.. ఇటీవల తీగుల్ గ్రామంలో ప్రజలు తీవ్రంగా నిరసన తెలిపారు. దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయని.. అర్హులకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక ప్రజలు ఈ క్రమంలోనే షర్మిలకు ఆహ్వానం పంపారు. దళితబంధుపై ప్రశ్నించాలంటూ విజ్ఞప్తి చేశారు. దాంతో.. రేపు ఉదయం 10 గంటలకు షర్మిల తీగుల్ గ్రామానికి చేరుకోనున్నారు. దళితబంధు పథకం గురించి అక్కడి ప్రజలను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు.
మరోవైపు షర్మిల తీగుల్ గ్రామానికి వస్తున్నారని తెలిసి పలువురు బీఆర్ఎస్ నాయకులు హెచ్చరికలు చేస్తున్నట్లు వైఎస్‌ఆర్‌టీపీ నాయకులు చెబుతున్నారు. సోషల్‌మీడియా వేదికగా అంతుచూస్తామని బెదిరిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకుల నుంచి హాని ఉందని తమ పర్యటకు భద్రత కల్పించాలని షర్మిల పోలీసులను కోరింది. సీఎం కేసీఆర్ ఇలాకాలో జరిగిన అక్రమాలు బయటపడతాయని బీఆర్ఎస్‌కు భయం పట్టుకుందని షర్మిల అన్నారు. నిజాలు బయటపడితే సొంత ఇలాకాలో ఓటమి తప్పదనే తమ పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని హెచ్చరికలు చేసినా.. పర్యటనను అడ్డుకోవాలని చూసినా తాము వెనక్కి తగ్గబోమని అన్నారు. పోరాటం ఆపమని చెప్పారు షర్మిల. దళితబంధు పథకంలో తీగుల్ గ్రామ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకుంటానని.. అది తన బాధ్యతగా చెప్పుకొచ్చారు వైఎస్ షర్మిల.