ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలి: షర్మిల
గద్దర్ కుటుంబ సభ్యులను వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు.
By Srikanth Gundamalla Published on 13 Aug 2023 8:30 PM ISTట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలి: షర్మిల
అనారోగ్య కారణాలతో ఇటీవల ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు. గద్దర్ కుటుంబ సభ్యులను వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. గద్దర్ సమాధి వద్ద కూర్చున్న షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించారు. సమాధిని చూసి వైఎస్ షర్మిల కన్నీరు పెట్టుకున్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
విప్లవ భావాలు, ఉద్యమ భావాలతో తన జీవితాన్ని గద్దర్ గడిపారని షర్మిల అన్నారు. వేల పాటలు రాసి ఎంతో మందిలో స్ఫూర్తి రగిలించారని అన్నారు. గద్దర్ బతికి ఉన్నప్పుడు కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. కానీ.. ఆయన ప్రాణాలు కోల్పోయినప్పుడు మాత్రం కన్నీరు కార్చారని అన్నారు. గద్దర్ లేకపోయి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు షర్మిల. ఆయన బతికి ఉన్నప్పుడు పట్టించుకోనందుకు కేసీఆర్.. ఆయన కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు గద్దర్ చాలా సార్లు ప్రయత్నం చేశారని.. సీఎం మాత్రం కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని షర్మిల అన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ మరణం తెలంగాణ కళా రంగానికి తీరని లోటు అని షర్మిల అన్నారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అదేవిధంగా పాఠ్య పుస్తకాల్లో గద్దర్ జీవితాన్ని పొందుపర్చాలని అన్నారు. మెదక్ జిల్లాలో గద్దర్ పుట్టిన గ్రామంలో మెమోరియల్ కూడా ఏర్పాటు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మనం అందరం పోరాటం చేసి అయినా సరే వీటిని సాధించాలని షర్మిల పిలుపునిచ్చారు.