ఓట్ల కోసమే కేసీఆర్ హామీలను గుర్తు చేసుకుంటున్నారు: షర్మిల

ఎవరైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రమాణస్వీకారం చేశాక నెరవేరుస్తారని.. కానీ కేసీఆర్ మాత్రం అలా చేయడం లేదన్నారు షర్మిల.

By Srikanth Gundamalla  Published on  3 Aug 2023 3:45 PM GMT
YS Sharmila, Comments, CM KCR, Manifesto,

ఓట్ల కోసమే కేసీఆర్ హామీలను గుర్తు చేసుకుంటున్నారు: షర్మిల

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. సాధారణంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నెరవేరుస్తారని.. కానీ కేసీఆర్ మాత్రం అలా చేయడం లేదన్నారు. కేసీఆర్‌కు రాష్ట్రంలో ఎన్నికల సమయం రాగానే హామీలు గుర్తుకు వస్తాయని విమర్శలు చేశారు. నాలుగేళ్లపాటు కుంభకర్ణుడిలా నిద్రపోయిన సీఎం కేసీఆర్.. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఓట్ల కోసం మేల్కొన్నారని అన్నారు. మేనిఫెస్టోను తిరగేశారని.. రైతులను ఓట్లు అడిగే ముఖం లేకే రుణమాఫీ అంటూ వినయం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల.

నాలుగున్నరేళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులకు దోచుకోవడం... దాన్ని దాచుకోవడానికే సమయం సరిపోయిందని షర్మిల అన్నారు. ఇక మేనిఫెస్టోలో ఉన్న హామీలను నెరవేర్చేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీకి డబ్బుల్లేక నవంబర్‌లో రావాల్సిన మద్యం టెండర్లను మూడు నెలల ముందే తీసుకొచ్చారని అన్నారు. జనాలకు మద్యం తాగించి.. ఆ వచ్చిన సొమ్ముతో రుణమాఫీ చేస్తారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెంచి.. పన్నుల ద్వారా ప్రజల నుంచి దోచుకున్నది సరిపోక.. ఇప్పుడు మద్యం తాగించి మహిళల మంగళసూత్రాలు తెంపుతారా అని ప్రశ్నించారు. జనాలను మద్యానికి బానిసలను చేసి ఓట్లు దండుకోవడమేనా మీ పాలన అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు వైఎస్ షర్మిల.

ఓట్ల కోసమే కేసీఆర్ హామీలను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. రుణమాఫీ చేసిన చేత్తోనే కేసీఆర్ డబుల్‌బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు, ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. వారిని ఆదుకోవాలని షర్మిల సూచించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, చట్ట సభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. నిలిచిపోయిన దళితబంధును కొనసాగించాలన్నారు. బీసీల్లో అన్ని కులాలకు బీసీ బంధు ఇవ్వాలన్నారు. ఇచ్చిన హామీలను అన్నింటిని ఎన్నికలకు ముందే నెరవేర్చాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు.


Next Story