యాదాద్రి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Srikanth Gundamalla Published on 15 March 2024 4:49 PM IST
యాదాద్రి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. కొండపైకి ఆటోలను అనుమతి ఇచ్చారు. గత కొన్నేళ్లుగా ఆటో వాళ్లు తాము యాదాద్రి కొండపైకి ఆటో నడుపుకొనేలా అనుమతివ్వాలంటూ ధర్నా చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకు యాదాద్రి ఆటోవాల డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చింది. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.
గతంలో మాదిరిగా కొండపైన భక్తులు నిద్రించే సౌకర్యాన్ని మళ్లీ పునరుద్ధరించింది. ఈ మేరకు కొండపైన ప్రత్యేకంగా డార్మెటరీ హాల్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో వెయ్యికి పైగా మంది భక్తులు నిద్రించే అవకాశం ఉంటుంది. ఈ డార్మెటరీ హాల్‌ను స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం ప్రారంభించారు. శుక్రవారం నుంచే డార్మెటరీ హాల్‌లో నిద్రించేందుకు భక్తులకు అనుమతి ఉంటుందని ఆయన వెల్లడించారు. వైటీడీఏ అధికారులు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత యాదగిరిగుట్ట స్వరూపాన్నే గత ప్రభుత్వం మార్చేసింది. 2015లో పునర్‌నిర్మాణ పనులు చేపట్టగా ఏళ్ల పాటు కొనసాగింది. ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి కొత్త నిర్మాణాలను చేపట్టింది. 2022లో మొత్తం పనులు పూర్తయ్యాయి. ఇక యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చారు. ప్రస్తుతం ఈ ఆలయం భక్తులతో పాటు.. పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది.