మా దగ్గర 40 లక్షల AK 47లు ఉన్నాయి

By Nellutla Kavitha  Published on  5 March 2022 3:32 AM GMT
మా దగ్గర 40 లక్షల AK 47లు ఉన్నాయి

ప్రపంచవ్యాప్తంగా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. రాజకీయాల్లోనూ దానికి సంబంధించినటువంటి భాషే ఉపయోగిస్తున్నారు నాయకులు. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లోను ఆయుధాల ప్రస్తావన చేస్తున్నారు నేతలు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి ఆసక్తికరమైన, కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ దగ్గర రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉంటే తమ దగ్గర మాత్రం 40 లక్షల ఏకే-47లు ఓట్ల రూపంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమం తో 40 లక్షలకు పైగా ఓటర్లు కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా చేరారరని దాన్ని 50 లక్షలకు చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు రేవంత్. మరోవైపు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటుగా కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించారు రేవంత్ రెడ్డి. సభ్యత్వ నమోదు లో చురుకుగా పని చేసిన వారి పేర్లను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కి రికమెండ్ చేస్తామని, డిజిటల్ మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ డ్రైవుల్లో ఉత్సాహంగా, చురుకుగా పాల్గొనని కార్యకర్తలకి టికెట్లు ఇవ్వమంటూ హెచ్చరించారు. అలాంటి వారికి పార్టీలోనూ ఎలాంటి పదవులు ఉండవని అన్నారు రేవంత్. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లో సభ్యుడిగా చేరాలనుకునే వాళ్లంతా పోలింగ్ బూత్ ల వారీగా ఒక్కొక్కరూ 100 మంది ఓటర్లను నమోదు చేయించాలని పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్.

Next Story
Share it