అర్ధరాత్రి మూడు పశువులు చోరీ.. పోలీసులకు బాధిత రైతు ఫిర్యాదు
ఈ సంఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని తుమ్మలపల్లిలో చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 17 Jun 2024 5:04 PM GMTఅర్ధరాత్రి మూడు పశువులు చోరీ.. పోలీసులకు బాధిత రైతు ఫిర్యాదు
దొంగలు ఇళ్లలో బంగారం, డబ్బులను ఎత్తుకెళ్లడం చూశాం. దారి దోపిడీలు, చైన్ స్నాచర్లు ఇలా చోరీలకు పాల్పడుతున్నవారు ఉంటారు. తాజాగా కొందరు దుండగులు పశువులను కూడా వదల్లేదు. ఏకంగా ఓ రైతు పొలానికి వెళ్లి.. మూడు పశువులను గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లారు. అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. కాస్త ఆలస్యంగా చూసుకున్న సదురు రైతు లబోదిబోమంటున్నాడు. పశువులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న అతను ఉన్న మూడు పశువులను పోగొట్టుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ సంఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని తుమ్మలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామంలో నివసిస్తున్న రైతు రహీముద్దీన్ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. అతనికి కొంత పొలంతో పాటు.. మూడు పశువులు ఉన్నాయి. ఇందులో రెండు ఎద్దులపై ఆధారపడే అతను వ్యవసాయం చేస్తున్నాడు. పొలం పనుల్లో పశువులు సాయంగా ఉండేవి. అయితే.. ఈ నెల 16వ తేదీ ఆదివారం రాత్రి రహీముద్దీన్ పొలం దగ్గరే పడుకున్నాడు. పశువులను కట్టేసి జాగ్రత్తగా ఉన్నాయా లేదా అని చూసుకుని షెడ్‌లో నిద్రపోయాడు. రాత్రి ఒంటి గంట తర్వాత మేల్కొని చూస్తే అక్కడ పశువులు కనిపించలేదు. సమీప ప్రాంతాల్లో చూశాడు కాని కనిపించలేదు. దాంతో ఆందోళన చెందిన రహీముద్దీన్ కుటుంబ సభ్యులతో పాటు స్థానికులకు సమాచారం ఇచ్చాడు. అందరితో కలిసి చుట్టుపక్కల వెతికి చూసినా లాభం లేకపోయింది. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరగడం.. ఆ తర్వాతి రోజు బక్రీద్ పండుగ కావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బక్రీద్ కోసమే తాళ్లను కోసేసి పశువులను తీసుకెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానిక గ్రామస్తులు .
కాగా.. పశువులు చోరీకి గురికావడంపై బాధితుడు రహీముద్దీన్ న్యూస్‌మీటర్‌తో మాట్లాడారు. 'నాది వికారాబాద్ జిల్లాలోని తుమ్మలపల్లి గ్రామం. ఎప్పటిలానే జూన్ 16వ తేదీ ఆదివారం రాత్రి పశువులను కట్టేసి.. అక్కడే షెడ్‌లో పడుకున్నా. రాత్రి పది గంటల వరకు మేల్కొనే ఉన్నా. ఆ తర్వాత పడుకుని అర్ధాత్రి ఒంటి గంటకు లేచి చూశాడు. అప్పటి వరకు కట్టేసి ఉన్న మూడు పశువులు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. బక్రీద్ ముందు అర్ధరాత్రి జరగడంతో పలు అనుమానాలు ఉన్నాయి. కానీ ఎవరు ఈ పని చేశారనేది తెలియడం లేదు. ఎవరిపైనా అనుమానాలు లేవు. వ్యవసాయానికి ఆధారంగా ఉన్న మూడు పశువులను కోల్పోవడం బాధగా ఉంది. మూడింటి ధర రూ.2లక్షల పైమాటే ఉంటుంది. మా పొలానికి దగ్గరలో సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ అవి కొంతకాలంగా పనిచేయడం లేదు. పక్క గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే కనీసం ఎవరు తీసుకెళ్లింది తెలిసి ఉండేది. ఇక చేసేదేం లేక మర్పల్లి పోలీసులకు పశువులు చోరీకి గురైన విషయాన్ని చెప్పాం. పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు. దర్యాప్తు చేస్తామని చెప్పారు. పశువులు తిరిగి దొరుకుతాయనే నమ్మకం నాకు లేదు. నష్టపోయిన రూ.2లక్షల గురించి ఆవేదనగా ఉంది. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు తన ఆవేదనను అర్థం చేసుకుని కొంత ఆర్థికసాయం అందిస్తే చాలని ఆశపడుతున్నా' అని బాధితుడు రహీముద్దీన్ అన్నాడు.
ఇక రహీముద్దీన్ పశువులను దుండగులను ఎత్తుకెళ్లడంపై గ్రామస్తులు రకరకాలుగా చెబుతున్నారు. ఒక్క రహీముద్దీన్‌కు చెందిన పశువులనే టార్గెట్ చేసి ఎత్తుకెళ్లారని అంటున్నారు. ఒక ఐదారుగురు వాహనంలో వచ్చి పశువులను తీసుకెళ్లారని గ్రామస్తులు అనుమానపడుతున్నారు. తుమ్మలపల్లిలో కేవలం 300 ఇళ్లే ఉన్నాయనీ.. ఎక్కడికి తీసుకెళ్లినా కనపడుతుందని అంటున్నారు. బయటి వారే ఈ పని చేశారని అంటున్నారు. ఏది ఏమైనా రహీముద్దీన్‌కు జరిగింది చూస్తే బాధగా ఉందంటున్నారు.