చెరువులోకి దూసుకెళ్లిన 40 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు

వికారాబాద్‌ జిల్లాలో 40 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్‌ బస్సు వేగంగా నీటి కుంటలోకి దూసుకెళ్లింది

By Srikanth Gundamalla  Published on  23 Sep 2023 8:45 AM GMT
Vikarabad, School bus, plunged into a pond,  40 students Safe,

చెరువులోకి దూసుకెళ్లిన 40 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు

వికారాబాద్‌ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. 40 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్‌ బస్సు అత్యంత వేగంగా నీటి కుంటలోకి దూసుకెళ్లింది. అయితే.. పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించారు.

వికారాబాద్‌ జిల్లాలోని పరిగి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఓ ప్రయివేట్‌ స్కూల్‌ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు బయల్దేరింది. అయితే.. సుల్తాన్‌పూర్‌ దగ్గర ప్రమాదవశాత్తు బస్సు అదుపు తప్పి ముందు భాగం మొత్తం నీటిలోకి దూసుకెళ్లింది. బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి నీటిలోకి దూసుకెళ్లడంతో బస్సులో ఉన్న విద్యార్థులంతా భయపడిపోయారు. దాంతో.. గట్టిగా అరవడం ప్రారంభించారు. పిల్లల అరుపులు విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. బస్సులో ఉన్న అందరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు చెబుతున్నారు. పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

అయితే.. ఇంకొంచెం ముందుకు వెళ్లి ఉంటే పెనుప్రమాదం సంభవించేందని స్థానికులు చెబుతున్నారు. చెరువు లోతు ఎక్కువగా ఉంటుందని బస్సు పూర్తిగా మునిగిపోయేదని అంటున్నారు. కాగా.. స్కూల్‌ బస్సు స్టీరింగ్‌ పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ తెలిపాడు. ఫిట్‌నెస్‌ లేకుండా బస్సుని ఎలా నడుపుతున్నారంటూ స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చివరకు స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Next Story