Vikarabad: కుక్క దాడిలో ఐదు నెలల పసికందు మృతి
వికారాబాద్ జిల్లాలోని తాండూరు బసవేశ్వర నగర్‌లో ఈ దారుణ సంఘటన జరిగింది.
By Srikanth Gundamalla Published on 14 May 2024 12:31 PM ISTVikarabad: కుక్క దాడిలో ఐదు నెలల పసికందు మృతి
వీధులు, ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. కొన్ని సందర్భాల్లో వారికి వారే ప్రమాదాల్లో పడతారు. ఇంకొన్ని సార్లు వీధి కుక్కలు పిల్లలపై దాడులు చేస్తుంటాయి. వీధి కుక్కల దాడిలో ఇప్పటికే చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇంకొన్ని సార్లు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారులపైనే కాదు.. పెద్దలపైనా ఈ వీధి కుక్కలు స్వైర విహారం చేస్తుంటాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఇలాంటి దారుణ సంఘటనే ఒకటి జరిగింది. ఇంట్లో పడుకోబెట్టిన ఐదు నెలల పసికందుపై కుక్క తీవ్రంగా దాడి చేసింది.
వికారాబాద్ జిల్లాలోని తాండూరు బసవేశ్వర నగర్‌లో ఈ దారుణ సంఘటన జరిగింది. దత్తు, లావణ్య అనే దంపతులు నివసిస్తున్నారు. వీరు తాండూరులోని నాపరాతి పాలిష్ యూనిట్‌లో పనిచేస్తున్నారు. ఇటీవలే పెళ్లి జరిగిన వారికి ఐదు నెలల బాబు ఉన్నాడు. మంగళవారం ఉదయం ఇంట్లో బాలుడికి స్నానం చేయించి పాలు పట్టిన తల్లి.. బాబు పడుకోగానే తన పనులను చూసుకుంది. ఈ క్రమంలోనే ఇంటి డోర్ మూసివేయడం మర్చిపోయింది. ఇక తన పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఒక కుక్క ఇంట్లోకి వచ్చింది.
నిద్రపోతున్న ఐదు నెలల బాలుడిని తీవ్రంగా కరిచింది. అప్పటికే బాబు ఏడుపులు విన్న తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ.. అప్పటికే ఆ కుక్క బాలుడిని తీవ్రంగా కరిచింది. రక్తపు మడుగులో బాలుడు స్పాట్‌లోనే చనిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేశామని చెప్పారు. వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చిన్నారుల తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.