Hyderabad: గన్‌మెన్లు అవసరం లేదని వెనక్కి పంపిన ఎమ్మెల్యే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది.

By Srikanth Gundamalla  Published on  4 Dec 2023 3:19 PM IST
uppal, brs mla, laxma reddy,  no gunmen,

Hyderabad: గన్‌మెన్లు అవసరం లేదని వెనక్కి పంపిన ఎమ్మెల్యే 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 119 నియోజకవర్గాలకు గాను 64 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకి అన్నీ సిద్ధం చేసుకుంటుంది. అయితే.. గెలిచిన ఎమ్మెల్యేలకు పోలీసులు భద్రత కల్పిస్తారు. వారికి గన్‌మెన్లను కేటాయిస్తారు. వారి భద్రత కోసం ఎప్పుడూ వెంటే ఉంటారు. సెక్యూరిటీని దాదాపుగా ఎవరూ కాదని చెప్పరు. కానీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఓ ఎమ్మెల్యే మాత్రం అందరికీ కాస్త భిన్నంగా ఉన్నారు. ఆయనకు సెక్యూరిటీ అవసరం లేదని తిరిగి గన్‌మెన్లను వెనక్కి పంపించేశారు.

ఉప్పల్‌ నుంచి బీఆర్ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బండారి లక్ష్మారెడ్డి ఘన విజయాన్ని అందుకున్నారు. ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి పరమేశ్వరరెడ్డిపై ఆయన 49,030 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే.. ఆయన గెలిచిన అనంతరం పోలీసు శాఖ బండారి లక్ష్మారెడ్డి భద్రత కోసం గన్‌మెన్లను పంపింది. అయితే.. తనకు గన్‌మెన్లు అవసరం లేదని.. తిరిగి వారిని వెనక్కి పంపించేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నిర్ణయం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన బండారి లక్ష్మారెడ్డి.. నిత్యం ప్రజల్లో మమేకమై ఉండే తనకు గన్‌మెన్లు అవసరం లేదని చెప్పారు. ప్రజలే తనకు రక్ష అంటూ దీమా వ్యక్తం చేశారు.

ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గం 10 కిలోమీటర్ల మేర ఉందని చెప్పారు బండారి లక్ష్మారెడ్డి. ఎన్నికల ముందు కూడా తన భద్రత కోసం పోలీసు శాఖ నుంచి 2+2 గన్‌మెన్లను పంపారనీ వారిని కూడా తిరిగి వెనక్కే పంపేసినట్లు వెల్లడించారు. గన్‌మెన్లు ఉంటే ప్రజలు తనతో మాట్లాడటానికి.. కలవడానికి ఇబ్బందికరంగా ఫీలవుతారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. అవినీతికి పాల్పడేవారికో.. లేదంటే ఇల్లీగల్ పనులు చేసేవారికో గన్‌మెన్లు అవసరం తప్ప తనలా నిత్యం ప్రజల్లో ఉండే వారికి గన్‌మెన్లు అవసరం లేదన్నారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

Next Story