బస్టాండ్లలో స్థలాలు, షాపుల లీజుకి TSRTC టెండర్లు

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధి బస్టాండ్లలో స్థలాలు, స్టాళ్లు, షాపులను లీజుకు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం రెడీ అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  18 Feb 2024 9:27 AM IST
TSRTC, tenders,  lease, shops,  bus stands,

బస్టాండ్లలో స్థలాలు, షాపుల లీజుకి TSRTC టెండర్లు 

తెలంగాణలో మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. దాంతో.. కొత్త ఆర్టీసీ బస్సులను యాజమాన్యం కొనుగోలు చేస్తోంది. అంతేకాదు.. ఇతర ఆదాయ మార్గాలను కూడా అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే టీఎస్‌ ఆర్టీసీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్న స్థలాలను లీజుకు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్ రీజనల్ పరిధిలో ఉన్న జేబీఎస్, సికింద్రాబాద్ బస్టాండ్లలో స్థలాలు, స్టాళ్లు, షాపులను లీజుకు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం రెడీ అయ్యింది. ఇప్పటికే వర్వేరుగా టెండర్‌ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మరోవైపు ఎంజీబీఎస్, కోఠి బస్టాండ్లలో కూడా టెండర్లను గతంలోనే ఇచ్చారు.

తాజాగా.. కాచిగూడ, మేడ్చల్, శామీర్‌పేట్, హకీంపేట్ వంటి ప్రధాన ప్రదేశాల్లో భూములు అందుబాటులో ఉన్నందుకు వాటిని అద్దెకు ఇచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్ధమయ్యింది. ఆ భూముల్లో అన్ని రకాల షాపులు, హోటళ్లు, ఫుడ్‌స్టాల్స్, పార్కింగ్, లాజిస్టిక్స్‌ (కార్గో పార్సిల్ సేవలు), డార్మిటరీ, ఆటో మొబైల్ సర్వీస్ సెంటర్లు, షోరూమ్‌లు, ఇన్‌సిటీ వేర్‌హౌస్‌లు ఏర్పాటు చేయాలనే నిబంధనలతో ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులను కోరుతోంది టీఎస్ ఆర్టీసీ.

లీజుకు ఇవ్వనున్న స్థలాల వివరాలను కూడా ప్రకటించింది టీఎస్‌ ఆర్టీసీ. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఎక్స్‌ వేదికగా వివరాలను పోస్టు చేశారు. కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్‌లో 2.83 ఎకరాలు, శామీర్‌పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.91 ఎకరాలు, రషీద్ గూడ1 లో 4.75 ఎకరాలు, రషీద్‌ గూడ 2లో 6.03 ఎకరాలు, తుర్కయంజల్‌1లో 5.75 ఎకరాలు, తుర్కయాంజల్2లో 6.23 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వనున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటనలో తెలిపింది. టెండర్ ప్రక్రియ, దరఖాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిప్యూటీ చీఫ్‌ పర్సనల్ మేనేజర్‌ను 9959224433 ద్వారా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌లో ఈ-టెండర్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 15వ తేదీగా నిర్ణయించింది ఆర్టీసీ యాజమాన్యం.


Next Story