బతుకమ్మ, దసరాకు TSRTC 5,265 ప్రత్యేక బస్సులు
బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ సన్నద్ధమైంది.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 12:19 PM ISTబతుకమ్మ, దసరాకు TSRTC 5,265 ప్రత్యేక బస్సులు
బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ సన్నద్ధమైంది. ఈ నెల 13 నుంచి 24వ తేది వరకు 5,265 ప్రత్యేక బస్సులను నడపునింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది టీఎస్‌ఆర్టీసీ సంస్థ. అందులో భాగంగానే హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ .. సంస్థకు పోలీసు, రవాణాశాఖలు ఎంతగానో సహకరిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా పండగల సమయంలో సంస్థ ఉద్యోగులతో కలిసి వారు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రయాణికులను రక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారని చెప్పారు. సంస్థకు వస్తోన్న ఫలితాల్లో పోలీస్, రవాణా శాఖల పాత్ర కూడా ఉందన్నారు సజ్జనర్. గతంలో మాదిరిగానే ఈ దసరాకు ఆయా శాఖలు సహకరించాలని ఆయన కోరారు.
అయితే.. బతుకమ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సజ్జనర్ తెలిపారు. ఈ నెల 20 నుంచి 23 వరకు అధిక రద్దీ ఉండే అవకాశముండటంతో.. ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. అదనంగా 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని సంస్థ కల్పించినట్లు వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు. గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 బస్సులను అదనంగా తిప్పుతున్నట్లు సజ్జనర్ తెలిపారు.
హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, ఆరాంఘర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్ సదన్, బొరబండ, శంషాబాద్ లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్ లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని సజ్జనార్ చెప్పారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నామన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారని వెల్లడించారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వలంటీర్లనూ నియమిస్తున్నట్లు సజ్జనర్ తెలిపారు.
ప్రయాణికులు సమయాన్ని వృథా చేసుకోకుండా టీఎస్ఆర్టీసీ ఇటీవల తీసుకువచ్చిన గమ్యం ట్రాకింగ్ యాప్ ను వినియోగించుకోవాలన్నారు. పండుగలకు రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి.. ఇబ్బందులు పడొద్దని సూచించారు. టీఎస్ఆర్టీసీలో ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని చెప్పారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో టికెట్ బుక్ చేసుకునేందుకు అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in సంప్రదించాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.