అద్దె బస్సుల యజమానలతో టీఎస్ఆర్టీసీ చర్చలు సఫలం

అద్దె బస్సుల యజమానులతో తెలంగాణ ఆర్టీసీ సంస్థ యాజమాన్యం చర్చలు జరిపింది.

By Srikanth Gundamalla
Published on : 4 Jan 2024 4:45 PM IST

TSRTC, negotiations,   rental bus owners,

అద్దె బస్సుల యజమానలతో టీఎస్ఆర్టీసీ చర్చలు సఫలం 

అద్దె బస్సుల యజమానులతో తెలంగాణ ఆర్టీసీ సంస్థ యాజమాన్యం చర్చలు జరిపింది. అయితే..ఈ చర్చలు సఫలం అయ్యాయి. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రధానంగా ఐదు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై సంస్థ ఉన్నతాధికారులతో చర్చించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. తమ సమస్యలకు పరిష్కారం చూపకపోతే శుక్రవారం నుంచి సమ్మె చేస్తామని అద్దె బస్సుల యజమానులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

అద్దె బస్సుల యజమానుల డిమాండ్ల పరిష్కారంపై కమిటీ సిఫార్సులను తీసుకుంటామనీ.. వాటిని పరిశీలించి యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వారికి తెలిపారు. దీనికి అద్దె బస్సుల యజమానులు కూడా సానుకూలంగా స్పందించారు. మహాలక్ష్మీ స్కీం అమలు తర్వాత తమకు ఇబ్బందులు ఎదురువుతున్నాయని సజ్జనార్‌కు తెలిపారు అద్దె బస్సుల యజమానులు. వారి సమస్యలపై కమిటీ శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తుందని తెలిపారు. సంస్థ బస్సులు, హైర్ బస్సుల డేటాను క్రోడీకరించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో టీఎస్‌ ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, వినోద్‌ కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

మరోవైపు సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడిపిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెబుతామన్నారు. ఈ సమావేశం తర్వాత మాట్లాడిన అద్దె బస్సుల యజమానులు.. ఐదు ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని ఆర్టీసీ ఎండీ చెప్పారని అన్నారు. జనవరి 10వ తేదీలోగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం నుంచి తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు అద్దె బస్సుల యజమానులు వెల్లడించారు.

Next Story