తెలంగాణ మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ విజ్ఞప్తి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 3:31 AM GMTతెలంగాణ మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ విజ్ఞప్తి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువైంది. మహిళలు పెద్ద ఎత్తున ఈ పథానికి వినియోగించుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ చూసినా ఎక్కువ శాతం మహిళలే కనిపిస్తున్నారు. అయితే.. రద్దీ కారణంగా కొంత ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ విజ్ఞప్తి చేశారు. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. దాంతో.. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెప్పారు. ఇందుకు పరిష్కార మార్గం కూడా చెప్పారు ఆయన. తక్కువ దూరం ప్రయాణం చేసే మహిళలు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణం చేయాలని సూచించారు. ఈ మేరకు ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణకులు సహకరించాలని ఎండీ సజ్జనార్ కోరారు.
అలాగే కొందరు మహిళలు అనుమతించిన స్టేజిల్లో కాకుండా.. మధ్యలో బస్సులు ఆపాలని డ్రైవర్లు, కండక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారని ఎండీ సజ్జనార్ అన్నారు. దాంతో.. ప్రయాణ సమయం మరింత పెరిగిపోతుందని.. ఇతర ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అందుకే ఇకపై ఎక్స్‌ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజిల్లో మాత్రమే ఆపడం జరుగుతుందని ఆయన తెలిపారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి… pic.twitter.com/bJryVNNxkM
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 23, 2023