Telangana: ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు రిజర్వ్‌డ్‌ సీట్లు..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు గ్యారెంటీ అమలుపై ఫోకస్ పెట్టింది.

By Srikanth Gundamalla  Published on  25 Dec 2023 8:19 AM GMT
TSRTC,   reserve seats,  men,

Telangana: ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు రిజర్వ్‌డ్‌ సీట్లు..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు గ్యారెంటీ అమలుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో భాగంగా రెండింటిని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. రాష్ట్ర మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్థానికత కార్డు చూపించి ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. సుదూర ప్రయాణాలు చేసేవారు సైతం నిలబడాల్సి వస్తోంది. దాంతో.. ఆర్టీసీ సంస్థకు పలు విజ్ఞప్తులు వస్తున్నాయి.

ముఖ్యంగా టికెట్‌కు డబ్బులు చెల్లించి నిలబడి ప్రయాణం చేస్తోన్న పురుషులు ఆర్టీసీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్‌ తీసుకుని మేం ఎందుకు నిలబడి ఇబ్బందులు పడుతూ సదూర ప్రయాణం చేయాలని మండిపడుతున్నారు. దాంతో.. ఆర్టీసీపై ఒత్తిడి పెరిగినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసమే రిజర్వ్‌ చేసిన సీట్లు ఉండేవి. కానీ.. ఇప్పుడు ప్రత్యేకంగా పురుషుల కోసం కూడా సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు నిర్ణయం తీసుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.

ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు రిజర్వ్‌ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డారు తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు. ఇందుకోసం బస్సుల్లో ఉండే 55 సీట్లలో 20 సీట్లు పురుషులకు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని డిపోల నుంచి మేనేజర్ల అభిప్రాయాలను సేకరించే పనిలో పడ్డారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. పురుషులకు సీట్లు సపరేట్‌గా కేటాయిస్తే వ్యతిరేకత వస్తుందా? అనే ఆందోళన కూడా అధికారుల్లో లేకపోలేదు. ఎందుకంటే దేశంలో సీనియర్‌ సిటిజన్స్‌, వికలాంగులు, మహిళలకు తప్ప పురుషులకు సీట్లు రిజర్వ్‌ చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఇక్కడ పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించడంతో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే దానిపై అధికారులు చర్చించుకుంటున్నారు.

మరోవైపు ఆర్టీసీ అధికారులు.. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉన్న రూట్లలో కొత్త బస్సులను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అద్దె బస్సులు కావాలంటూ ఇటీవల ఆర్టీసీ సంస్థ ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story