అద్దెకు బస్సులు కావాలి.. తెలంగాణ ఆర్టీసీ ప్రకటన

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది.

By Srikanth Gundamalla  Published on  22 Dec 2023 11:15 AM GMT
TSRTC, inviting applications,  supply city buses, md sajjanar,

అద్దెకు బస్సులు కావాలి.. తెలంగాణ ఆర్టీసీ ప్రకటన

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకానికి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. బస్సు సౌకర్యాలు తక్కువగా ఉన్న రూట్లలో అయితే మరింత రద్దీ కనబడుతోంది. కనీసం కాలు పెట్టే చోటు కూడా ఉండటం లేదు. ఇలా రద్దీకి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తరచూ కనబడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఒక ప్రకటన చేసింది. తమకు బస్సులు సరిపోవడం లేదనీ విజ్ఞప్తులు రావడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వయంగా స్పందించారు. వెంటనే ఆర్టీసీకి అద్దె బస్సులు కావాలంటూ ప్రకటన ఇచ్చారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో గుర్తింపు పొందిన మార్గాల్లో టీఎస్‌ ఆర్టీసీ నిర్వహణ కోసం హైర్‌ స్కీమ్‌ కింద మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డనరీ, సిటీ సబర్బన్‌ బస్సుల సరఫరా కోసం ఎంటర్‌ప్రెన్యూయర్స్‌ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. ఈ మేరకు ఈ ప్రకటనను ఆ సంస్థ ఎండీ సజ్జనార్‌ కూడా తాజాగా ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు పెట్టారు.

ప్రకటన విడుదల చేసిన ఆర్టీసీ సంస్థ ఈ మేరకు పలు వివరాలను తెలిపింది. రూట్‌ లిస్ట్‌, టెండర్‌ దరఖాస్తు రోజువారీ కిలోమీటర్లు, రెంటల్ రేటు, ఎంటర్‌ ప్రెన్యూయర్స్‌ ఎంపిక కోసం ప్రమాణాలను తెలిపింది. కాషన్‌ డిపాజిట్, బస్సు మోడల్, కనీస వీఎల్‌ బేస్, సీటింగ్ సామర్థ్యం, సీటు నమూనా, రంగు, బస్సు బాడీ ప్రమాణాలు సహా ఇతర టెండర్ నోటిఫికేషన్ షరతులు, నిబందనలను, టెండర్‌ తేదీ, ఇతర మొత్తం వివరాలను టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో చూడవచ్చని ప్రకటన ఇచ్చింది ఆ సంస్థ. డిసెంబర్ 22 నుంచే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఆసక్తి ఉన్నవారు http://tsrtc.telangana.gov.in వెబ్ సైట్ లేదా 9100998230 నెంబర్‌లో సంప్రదించవచ్చునని సూచిస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది.


Next Story