కార్గో సేవల్లో పార్శిళ్లు ఇళ్ల వద్దకే డెలివరీ.. TGSRTC కసరసత్తు

ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది.

By Srikanth Gundamalla  Published on  29 July 2024 7:00 AM GMT
TSRTC, Cargo parcel,   home to home delivery,

 కార్గో సేవల్లో పార్శిళ్లు ఇళ్ల వద్దకే డెలివరీ.. TGSRTC కసరసత్తు

ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తోంది. రద్దీ విపరీతంగా పెరగడంతో దానికి అనుగుణంగా బస్సు సర్వీసులను కూడా పెంచుతోంది. మరోవైపు ఆర్టీసీ ద్వారా కార్గో సేవలను కూడా అందిస్తోంది. కార్గో, పార్శిల్‌ సేవల ద్వారా వస్తువులను ఒక చోటు నుంచి మరో చోటుకు తక్కువ ధరల్లోనే రవాణా చేస్తోంది. ఈ సేవలను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ఆర్టీసీ ఆదాయ మార్గాలు, స్థితిగతులపై ఇటీవల రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమీక్షించి ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రస్తుతం కార్గో, పార్సిల్‌ సేవలు ముఖ్యమైన ఆర్టీసీ బస్టాండ్ల వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నాయని అన్నారు. బస్టాండుల్లో కాకుండా.. ప్రైవేటు పార్సిల్ సర్వీసుల మాదిరిగా ఇంటి నుంచి ఇంటి వరకు. సేవలు అందించేలా లాజిస్టిక్‌ విభాగాన్ని అభివృద్ధి చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులకు సూచించారు. ఇళ్ల వద్ద బుకింగ్‌ తీసుకుని.. వచ్చిన పార్సిళ్లను తిరిగి వారు చెప్పిన అడ్రస్‌కు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. ఈ కొత్త కార్గో సేవల ప్రక్రియ మరో వారం, పది రోజుల్లో కొలిక్కి రానుందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.

ఇంటికే పార్శిళ్లు అందించడంలో మాజీ ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులను భాగస్వామ్యులను చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో చెప్పారు. అలా చేయడం ద్వారా వారికి ఆదాయ వనరులు కల్పించినట్లు అవుతుందన్నారు. ఆర్టీసీ వార్షిక ఆదాయం కూడా పెంచాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముందుగా హైదరాబాద్‌లో ఈ సేవలను ప్రారంభించి.. ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరింపజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story