గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో అవకతవకలు జరగలేదు: TSPSC

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీఎస్‌పీఎస్‌సీ వివరణ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  28 Sept 2023 5:53 PM IST
TSPSC, clarity,  Group-1 prelims, exam ,

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో అవకతవకలు జరగలేదు: TSPSC

తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష మరోసారి నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్‌ 11న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష గురించి టీఎస్‌పీఎస్‌సీ వివరణ ఇచ్చింది. ఆ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేల్చి చెప్పింది. 258 పేపర్లు అదనంగా వచ్చాయన్న ఆరోపణలపై వివరణ ఇస్తూ గురువారం ఒక ప్రకటన జారీ చేసింది టీఎస్‌పీఎస్‌సీ.

పరీక్షకు 2,33,248 మంది అభ్యర్థులు హాజరు అయ్యారని ఆ రోజు కలెక్టర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రకటన ఇచ్చామని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. పారదర్శకత కోసం అదే విషయం మీడియాతో చెప్పామని వెల్లడించింది. ఓఎంఆర్‌ స్కానింగ్‌లో 2,33,506 మంది పరీక్ష రాసినట్లు తేలిందని చెప్పింది టీఎస్‌పీఎస్‌సీ. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షను 33 జిల్లాల్లోని 994 కేంద్రాల్లో నిర్వహించామన్ని వెల్లడించింది. అనేక జిల్లాల్లో లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అయ్యారు. లక్షల సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాసినప్పుడు అంకెల్లో స్వల్ప మార్పులు రావడం సహజమే అని టీఎస్‌పీఎస్‌సీ పేర్కొంది. స్కానింగ్ తర్వాత తుది సంఖ్య ప్రకటించామని తెలిపింది. కాగా.. పరీక్ష నిర్వహించాక మరికొన్ని పేపర్లను కలిపే ఆస్కారమే లేదని.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పారదర్శకతతో నిర్వహించామని టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును బుధవారం హైకోర్టు ధర్మాసనం కూడా సమర్ధించింది. గతంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో పరీక్షను రద్దు చేసి.. మరోసారి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను నిర్వహించింది టీఎస్‌పీఎస్‌సి. మరిన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాల్సి ఉండాల్సిందని తెలంగాణ హైకోర్టు అన్నది. స్పష్టమైన చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. ఆ తర్వాత టీఎస్‌పీఎస్‌సీ దాఖలు చేసిన అప్పీల్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను మరోసారి నిబంధనల ప్రకారం నిర్వహించాలని తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.


Next Story