పట్టాలు దాటుతున్న వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ సంఘటనలో వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. బీబీనగర్-ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో చనిపోయిన వృద్ధుడి వివరాలు తెలియరాలేదు. అయితే.. వృద్ధుడిని ఢీకొట్టడంతో అతని మృతదేహం రైలు ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకుంది. ఇది గమనించని లోకో పైలట్ ట్రైన్‌ను అలానే ముందుకు పోనిచ్చాడు. అలా దాదాపు 5 కిలోమీటర్ల వరకు మృతదేహాన్ని ట్రైన్ ఇంజిన్‌కు లాక్కొచ్చింది. రైల్వే గేటు వద్ద రైలును గమనించిన స్థానికులు.. రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
దాంతో అప్రమత్తమైన ఆర్‌పీఎఫ్ సిబ్బంది లోకో పైలట్‌కు ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఘట్కేసర్ దాటిన తర్వాత రైలును ఆపించారు. ఆర్‌పీఎఫ్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని రైలు ఇంజిన్ నుంచి తొలగించారు. మృతి చెందిన వృద్ధుడు నీలం రంగు చొక్కా, ఆరెంజ్ లుంగీ, కుడికి కడియం ధరించాడని రైల్వే పోలీసులు తెలిపారు. ప్యాసింజర్ రైలు వరంగల్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రాదం చోటుచేసుకుంది. వృద్ధుడి డెడ్‌బాడీని ఆస్పత్రికి తరలించారు. ఆనవాళ్ల ఆధారంగా ఎవరైనా వస్తారేమో అని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.