ప్రగతిభవన్ వద్ద బారికేడ్లను జేసీబీలతో తొలగింపు (వీడియో)
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సీఎం అధికార నివాసం ప్రగతి భవన్ ఉండేది.
By Srikanth Gundamalla Published on 7 Dec 2023 12:24 PM ISTప్రగతిభవన్ వద్ద బారికేడ్లను జేసీబీలతో తొలగింపు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సీఎం అధికార నివాసం ప్రగతి భవన్ ఉండేది. అయితే.. కేసీఆర్ సీఎంగా రాజీనామా చేసిన తర్వాత ఆ భవనాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రగతిభవన్‌లోకి వెళ్లేందుకు సామాన్యులకు వీలుగా ఉండేది కాదు. దాంతో.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‌ను.. ప్రజా భవన్‌గా చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. తాము అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించింది. దాంతో.. రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగానే ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి.
ముందుగా ప్రగతిభవన్ వద్ద ఉన్న ఆంక్షలను ఎత్తివేశారు అధికారులు. ప్రగతి భవన్ ముందున్న బారికేడ్లను తొలగించే పనులు ప్రారంభించారు. పైనుంచి ఆదేశాలు రావడంతో జేసీబీలు ప్రగతిభవన్ వద్దకు చేరుకున్నాయి. అక్కడున్న బారికేడ్లను తొలగిస్తున్నారు. ప్రగతిభవన్ ముందు రోడ్డుపై ఉన్న బారికేడ్ల లోపల నుంచి వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే.. బారికేడ్లను మొత్తంగా తొలగించేందుకు పనులు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు. త్వరలోనే అన్ని బారికేడ్లను తొలగించేలా చూస్తామని అధికారులు చెప్పారు.
రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే ఈ బారికేడ్ల తొలగింపు.. ఆంక్షల ఎత్తివేడయంతో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని అధికారం కట్టబెట్టిన ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ గెలుపు తర్వాత తొలి మీడియా సమావేశంలోనే ప్రగతిభవన్‌ను.. ప్రజాభవన్‌గా మారుస్తామని చెప్పిన విషయం తెలిసిందే. సామాన్య ప్రజలకు సైతం ప్రగతిభవన్ లోపలికి అనుమతి ఉంటుందని చెప్పారు.