తెలంగాణలో ఇవాళ సాయంత్రంతో ముగియనున్న ప్రచారం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది.
By Srikanth Gundamalla Published on 28 Nov 2023 1:47 AM GMTతెలంగాణలో ఇవాళ సాయంత్రంతో ముగియనున్న ప్రచారం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇన్ని రోజులు జోరుగా ప్రచారం సాగింది. ఇక ఆ ప్రచారం, ర్యాలీలు.. సభలు నేటి సాయంత్రంతో ముగియనున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రచారంలో దూసుకుపోతున్న రేసు గుర్రాల మైక్‌లు మూగబోనున్నాయి. ఆయా పార్టీల నుంచి టికెట్లు దక్కించుకుని ఊరూరా ప్రచార వాహనాల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని కోరిన అభ్యర్థులకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దాంతో.. ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల పోలింగ్‌కు సిద్ధం అవుతున్నారు. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు.
అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఆయనతో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా అభ్యర్థులకు మద్దతుగా ఆయా ప్రాంతాల్లో సభల్లో పాల్గొన్నారు. ఇక ఇవాళ సీఎం కేసీఆర్ గజ్వేల్ సభతో ఆయన ప్రచారం ముగియనుంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎంతో పాటు పలువురు ప్రముఖలు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. బీజేపీ నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్, రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు నాయకులు ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు ఈసారి ఎలాగైనా కేసీఆర్ సర్కార్‌ను గెద్దె దించి.. తాము అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ సీపీఐ, కోదండరాం పార్టీ, షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ మద్దతును తీసుకున్నాయి. మరోవైపు బీజేపీ కూడా జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో బరిలోకి దిగింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,298 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఎలాగైనా గెలిచేందుకు శక్తియుక్తులు ప్రయోగించి ప్రజల మద్దతు కోరారు. మరోవైపు ప్రచారం చివరి రోజుకు చేరుకోవడంతో ఎన్నికల అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. మంగళవారం రాత్రి నుంచి నగదు, మద్యం, నజరాణాల పంపిణీకి అభ్యర్తులు తెరతీస్తారని అప్రమత్తం అవుతున్నారు. కాగా.. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.