బ్యాంకుపై ప్రశంసలు కురిపించిన చోరికి వెళ్లిన దొంగ..!

ఓ దొంగ బ్యాంకుపై కన్ను వేశాడు. కానీ.. అక్కడ అతనికేమీ దొరకలేదు. దాంతో ఒక లెటర్ రాసిపెట్టి వచ్చాడు.

By Srikanth Gundamalla  Published on  2 Sep 2023 1:49 AM GMT
thief, steal bank, no money, mancherial,

బ్యాంకుపై ప్రశంసలు కురిపించిన చోరికి వెళ్లిన దొంగ..!

జల్సాలకు అలవాటు పడో.. లేదంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా కొందరు దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఏదేమైనా చేసేది తప్పు పనే. తప్పుడు దారిలో నడిచేవారికి శిక్ష తప్పదు. దొంగతనాలకు పాల్పడ్డవారు ఏదోవిధంగా పట్టుబడుతుంటారు. ముఖ్యంగా సీసీ కెమెరాలకు చిక్కి కటకటాల పాలవుతుంటారు. అయితే.. ఓ దొంగ బ్యాంకుపై కన్ను వేశాడు. అందులో దొంగతనానికి వెళ్తే ఊహించినదానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బు దోచుకోవచ్చని భావించాడు. ప్లాన్‌ వేసుకుని చోరీకి వెళ్లాడు. కానీ.. అక్కడ అతనికేమీ దొరకలేదు. ఏం చేయాలో తెలియక గుడ్‌ బ్యాంక్‌.. ఒక్క రూపాయి కూడా దొరకలేదంటూ లెటర్‌ రాసి పెట్టి వచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కేంద్రంలో జరిగింది ఈ ఘటన. నెన్నెల ఎస్‌ఐ శ్యామ్‌ పటేల్‌ తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించాడు. తాళం పగలగొట్టి బ్యాంకులోకి చొరబడ్డాడు. ఆ తర్వాత లాకర్‌ రూమ్‌లోకి వెళ్లి చోరీ చేద్దామని అనుకున్నాడు. కానీ.. అతనికి లాకర్‌ గది ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. దాంతో నిరాశచెందిన దొంగ ఒక లెటర్ రాసిపెట్టి వెళ్లాడు. 'గుడ్‌ బ్యాంకు.. ఒక్క రూపాయి దొరకలేదు. నన్ను పట్టుకోవద్దు. నా వేలి ముద్రలు కూడా దొరకవు' అంటూ కాగితంపై రాసి ఉంచి వెళ్లాడు. ఇక తాళం పగలగొట్టి ఉండటం.. లెటర్‌ లభ్యం కావడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు. వారి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశామని.. దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. బ్యాంకు సందర్శించామని.. క్లూస్‌ సేకరిస్తున్నామని చెప్పారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి దొంగను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Next Story