అలర్ట్.. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలో కరెంట్ బిల్లు కడుతున్నారా?
తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్‌పీడీసీఎల్ అలర్ట్ జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 2 July 2024 10:00 AM ISTఅలర్ట్.. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలో కరెంట్ బిల్లు కడుతున్నారా?
తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్‌పీడీసీఎల్ అలర్ట్ జారీ చేసింది. విద్యుత్తు వినియోగదారులు ఇకపై బ్యాంకింగ్ యాప్‌లతోపాటు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్‌పే లాంటి థర్డ్‌పార్టీ యాప్‌ల నుంచి బిల్లులు చెల్లించడం కుదరదు.
తెలంగాణలో గృహజ్యోతి పథకం కింద రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తుంది. అయితే.. లబ్ధిదారులు 200 యూనిట్ల కరెంట్‌ను వాడితే జీరో బిల్లును పొందుతున్నారు. అలాంటి వారు కరెటు బిల్లులు కట్టనసరం లేదు. ఇక 200 యూనిట్లకు పైగా విద్యుత్ వాడుతున్న వారు మాత్రం కరెంటు బిల్లులు కట్టాల్సి ఉంటుంది. చాలా కాలం నుంచి కరెంటు బిల్లులు కట్టడానికి కార్యాలయానికి వెళ్లడం మానేశారు వినియోగదారులు. డిజిటల్ కాలం నడుస్తోన్న క్రమంలో మొత్తం ఆన్‌లైన్‌లోనే పేమెంట్స్ చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్ యాప్‌లు కూడా వినియోగదారులకు వీలైన ఆప్షన్లు ఇస్తున్నాయి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇస్తున్నాయి. బిల్లు కట్టాల్సిన తేదీలను గుర్తు చేస్తున్నాయి. తద్వారా కూర్చున్న దగ్గర నుంచి ఇన్నాళ్లు చాలా మంది విద్యుత్ బిల్లులను పే చేశారు. ఇక నుంచి ఇలా కుదరదు.
ఇక నుంచి కరెంట్ బిల్లులను డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా కట్టలేరంటూ.. షాక్ ఇచ్చింది టీజీఎస్పీడీసీఎల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు.. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్‌పే లాంటి థర్డ్‌పార్టీ యాప్‌లతో పాటు బ్యాంకుల యాప్‌లు, ఇతరత్రా ఏ యాప్‌ల ద్వారా కూడా విద్యుత్ బిల్లులు స్వీకరించవని తెలిపారు. ఈ మేరకు టీజీఎస్పీడీసీఎల్ ప్రకటన చేసింది. ఈ నిబంధన జూలై 01, 2024 నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో.. వినియోగదారులందరూ TGSPDCL వెబ్‌సైట్ లేదా.. TGSPDCL మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంట్ బిల్లును చెల్లింపులు చేయాలని విజ్ఞప్తి చేసింది.