సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ద్‌లో మహిళా రాజకీయ నాయకులు మధ్య ఆసక్తికర పోటీ!
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు కొనసాగుతూ ఉంది. ఇద్దరు మహిళా రాజకీయ నాయకులు ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడుతూ ఉండడం విశేషం.
By Bhavana Sharma Published on 6 Nov 2023 11:00 AM ISTసికింద్రాబాద్ కంటోన్మెంట్‌ద్‌లో మహిళా రాజకీయ నాయకులు మధ్య ఆసక్తికర పోటీ!
ఈ అసెంబ్లీ ఎన్నికలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు కొనసాగుతూ ఉంది. ఇద్దరు మహిళా రాజకీయ నాయకులు ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడుతూ ఉండడం విశేషం. ముఖ్యంగా వారి రాజకీయ నేపథ్యాలు, గత చరిత్రను దృష్టిలో ఉంచుకుంటే అక్కడ ఉత్కంఠ పోరు కొనసాగనుంది. బీఆర్‌ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న లాస్య నందిత పోటీదారుల్లో ఒకరు. దివంగత ఎమ్మెల్యే జి సాయన్న కుమార్తె. ఆయన మరణానంతరం ఈ నియోజకవర్గం టికెట్ కేటాయింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాత్రం లాస్యనే అభ్యర్థిగా ప్రకటించింది.
కవాడిగూడలో మాజీ కార్పొరేటర్‌గా కూడా పనిచేసిన లాస్య తన తండ్రి ప్రజాసేవను గమనిస్తూనే రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆమె సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గతంలో కవాడిగూడలో కార్పొరేటర్‌గా పని చేయడం వల్ల 2016 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, ఆమె 2020లో 1,477 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రచన శ్రీ చేతిలో ఓడిపోయారు. హైదరాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏకైక ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం.. ఆమె తండ్రి సాయన్న ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
లాస్యకు గట్టి పోటీ ఇవ్వాలని వెన్నెల భావిస్తోంది. వెన్నెల మరెవరో కాదు.. దివంగత విప్లవ కళాకారుడు గద్దర్ కుమార్తె. వెన్నెల లాస్యకు ఈ నియోజకవర్గంలో అసలు సిసలైన సవాలు విసిరారు. అసెంబ్లీ ఎన్నికలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం వెన్నెల చురుగ్గా ప్రయత్నించారు. పార్టీ విడుదల చేసిన రెండో జాబితాలో ఆమె సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు పోటీ చేస్తారని అధికారిక ప్రకటన రావడంతో ఆమె వర్గంలో ఫుల్ జోష్ వచ్చింది.
తన తండ్రి చివరి రోజుల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంతో పాటు ఈ ఏడాది మార్చి నుంచి జూలై వరకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తలపెట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రలో పాల్గొన్న విషయాన్ని వెన్నెల ప్రస్తావించారు. ఈ ఎన్నికల ద్వారా వెన్నెల రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగొందాలని భావిస్తున్నారు. ఆమె రాజకీయ అరంగేట్రం ఎలా ఉండబోతోందో చూడాలి. ఈ ఇద్దరు మహిళా రాజకీయ నేతలు ఎలా ప్రచారం చేయబోతున్నారు.. వారి వ్యూహం ఏంటి.. ప్రజల విశ్వాసాన్ని ఎలా గెలుచుకుంటారన్నది మున్ముందు తెలియనుంది. ఏది ఏమైనా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మాత్రం మంచి పోటీ ఉండనుంది.