Telangana: ట్రాఫిక్‌ పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ

వాహనదారులకు చలాన్ల చెల్లింపుపై తెలంగాణ పోలీసు శాఖ భారీ ఊరట అందించింది. భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది.

By Srikanth Gundamalla  Published on  22 Dec 2023 4:09 PM IST
telangana police, discount,  pending challan,

 Telangana: ట్రాఫిక్‌ పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ 

ట్రాఫిక్‌ చలాన్లు చెల్లించకుండా చాలా మంది వాహనదారులు తిరుగుతుంటారు. పోలీసులకు చిక్కకుండా ఇతర మార్గాలను ఎంచుకుంటూ పారిపోతారు. ఎప్పుడో ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకుంటే తప్ప చాలా మంది చలాన్లు చల్లించడం లేదు. దాంతో.. తెలంగాణలో పెద్దఎత్తున ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్ లో పడిపోయాయి. ఈ క్రమంలోనే పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాయితీలను ప్రకటించడం ద్వారా గతంలో దాదాపు పెండింగ్‌ చలాన్లను కట్టేశారు వాహనదారులు. మరోసారి అలాంటి రాయితీనే పోలీస్‌ శాఖ వాహనదారుల కోసం ప్రకటించింది.

వాహనదారులకు చలాన్ల చెల్లింపుపై తెలంగాణ పోలీసు శాఖ భారీ ఊరట అందించింది. భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ రాయితీలో భాగంగా ద్విచక్ర వాహనాలకు చలాన్లపై 80 శాతం రాయితీ ప్రకటించారు. గతంలో ద్విచక్ర వాహనాలపై 75 శాతం రాయితే ఉంటే.. దానితో పోలిస్తే ఈసారి ఎక్కువ డిస్కౌంట్‌ ఇచ్చారు పోలీసులు. ఈనెల 30వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. చలాన్లను ఆన్‌లైన్‌తో పాటు మీసేవా కేంద్రాల్లో కూడా చెల్లించవచ్చని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.

పెండింగ్ చలాన్ల చెల్లింపునకు పోలీసుశాఖ ఆఫర్లు:

* ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి పెండింగ్ చలాన్లలో 90 శాతం రాయితీ

* ద్విచక్ర వాహనదారుల పెండింగ్ చలాన్లపై 80 శాతం రాయితీ

* ఫోర్ వీలర్స్, ఆటోలకు అయితే 60 శాతం డిస్కౌంట్

* లారీలు సహా ఇతర హెవీ వెహికల్స్‌కు 50 శాతం రాయితీ కల్పించిన పోలీసు శాఖ

తెలంగాణలో నవంబర్‌ నాటికి చలాన్ల సంఖ్య 2 కోట్లకు పైగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చలాన్లను వసూలు చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్ చలాన్లు ఉంటే.. అప్పుడు రాయితీ కల్పించడం ద్వారా ఏకంగా రూ.300 కోట్ల వరకు చలాన్లు వసూలు అయ్యాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో పెద్ద మొత్తంలో చలాన్లు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

Next Story