అర్హత ఉన్నా జీరో కరెంట్ బిల్లు రాకపోతే ఇలా చేయండి..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా అందిస్తోంది.
By Srikanth Gundamalla Published on 1 March 2024 4:15 AM GMTఅర్హత ఉన్నా జీరో కరెంట్ బిల్లు రాకపోతే ఇలా చేయండి..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా అందిస్తోంది. ఈపథకాన్ని ఇవాళ్టి నుంచే అమల్లోకి తెస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెల్ల రేషన్ కార్డు ఉండి.. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిని అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. అయితే.. హైదరాబాద్ నగరంలో సున్నా కరెంట్ బిల్లులకు రంగం సిద్ధమైంది. విద్యుత్ బిల్లులతో రేషన్ కార్డు అనుసంధానమైన వినియోగదారులకు ఈ పథకం వర్తింపజేయనున్నారు అధికారులు. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడకం ఉన్న అందరికీ మార్చి నెల జీరో బిల్లు వస్తుంది.
విద్యుత్ అధికారులు ఈ మేరకు బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో ఇప్పటికే మార్పులు చేశారు. కొత్త బిల్లింగ్ యంత్రాలను కూడా కొనుగోలు చేశారు. వీటి పనితీరుని ఇప్పటికే పరిశీలించామని వారు తెలిపారు. టెస్టింగ్ కోసం సున్నా బిల్లులు జారీ చేసి చూశామన్నారు. అంతా సక్రమంగానే ఉందనీ.. ఇక నగరంలో తొలుత జీరో బిల్లులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. అన్ని సెక్షన్లలో మార్చి 1వ తేదీ నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సీఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి నెల ఖాతాలను ముగించి.. మార్చి వివరాలను బిల్లింగ్ యంత్రాల్లో లోడ్ చేయాలని చెప్పారు.
అర్హత ఉన్నా జీరో విద్యుత్ బిల్లు ఇవ్వకుంటే ఇలా చేయండి:
200 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడి, తెల్లరేషన్ కార్డు ఉండి కూడా ఏదైనా లోపం వల్ల జీరో కరెంటు బిల్లు రాకపోతే వారికి పలు సూచనలు చేస్తోంది ప్రభుత్వం. మున్సిపల్, మండల కార్యాలయాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. ఆహార భద్రత కార్డు, దానికి లింక్ చేసిన ఆధార్, గృహ విద్యుత్ కనెక్షన్ల నంబర్‌ను దరఖాస్తుతో పాటు సమర్పించాలని వివరించింది. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత విద్యుత్ సిబ్బంది అర్హుల జాబితాలో పేర్లను చేరుస్తారని వెల్లడించింది. ఇక ఆ తర్వాత నెల నుంచే గృహజ్యోతి పథకం లబ్ధిదారులుగా అవుతారని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం.