ఇవాళ రూ.లక్ష రుణమాఫీ, కొన్ని గ్రామాల్లో జాబితాలో లేని రైతుల పేర్లు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 18 July 2024 1:10 AM GMTఇవాళ రూ.లక్ష రుణమాఫీ, కొన్ని గ్రామాల్లో జాబితాలో లేని రైతుల పేర్లు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఆగస్టు 15లోపు ఈ ప్రక్రియను చేపడతామని చెప్పింది.ఈ నేపథ్యంలోనే రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం గుడ్‌న్యూస్ చెప్పారు. గురువారం సాయంత్రం నుంచి రూ.లక్ష వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ అవుతాయని చెప్పారు. సాయత్రం 4 గంటల నుంచి తొలిదశలో ఈ కార్యక్రమం అమలు కానుంది. రూ.లక్ష వరకు రుణం ఉన్న 11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6098 కోట్లు నేరుగా ఇవాళ ప్రభుత్వం జమ చేయనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను వ్యవసాయ, ఆర్థికశాఖలు పూర్తి చేశాయి.
రూ.2లక్షల రుణమాఫీకి మొత్తం 39 లక్షల కుటుంబాలు అర్హత సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో 60 లక్షల మంది రైతులు ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రుణమాఫీకి మొత్తం రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. గురువారం రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తుండగా, నెలాఖరులోగా రూ.1.5 లక్షల వరకు, ఆగస్టులో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
మరోవైపు రైతురుణమాఫీ కార్యక్రమం మొదలవుతున్న సందర్భంగా ప్రభత్వం రైతు వేదికల్లో సంబరాలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ నిధులను విడుదల చేసిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఆన్‌లైన్ ద్వారా రైతులతో మాట్లాడుతారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రైతువేదికల్లో వేడుకలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
కాగా.. రుణమాఫీకి సంబంధించి అధికారులు రూపొందించిన జాబితాల్లో కొన్ని గ్రామాల్లో గందరగోళం నెలకొన్నదని తెలిసింది. తమ పేర్లు జాబితాలో లేవంటూ కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రూ.లక్ష వరకు గల రుణ గ్రహీతల జాబితాను వ్యవసాయ శాఖ జిల్లాలకు విడుదల చేసింది. అయితే ఇందులో పలు సమస్యలు ఎదురైనట్టు సమాచారం. బుధవారం రాత్రి వరకు కూడా కొన్ని జిల్లాల్లో ఏఈవోలకు జాబితా అందలేదని సమాచారం. మరోవైపు, జాబితాలో పేర్లపై రైతుల్లో ఆందోళన నెలకొన్నది. రూ.లక్షలోపు రుణం ఉన్నప్పటికీ తమ పేరు జాబితాలో లేదంటూ వ్యవసాయ శాఖ అధికారులకు పలువురు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు.