మీ ఓటు మరొకరు వేసేశారా..? దిగులు వద్దు.. ఇలా చేయండి..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజవకర్గాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 30 Nov 2023 10:45 AM ISTమీ ఓటు మరొకరు వేసేశారా..? దిగులు వద్దు.. ఇలా చేయండి..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజవకర్గాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేలా చూస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే.. ఓటు వేసేందుకు ఇప్పటికే ఓటర్లకు రాజకీయ నాయకులతో పాట.. ఎలక్షన్ అధికారులు అవగాహన కల్పించిన విషయం తెలిసిందే.
అయితే.. ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లి. మీ ఓటు మరొకరు వేసేశారు అనడం సహజంగా తక్కువగానే వింటుంటాం. ఎక్కడో ఒక చోట ఇలాంటివి జరుగుతుంటాయి. ఒక వేళ ఇలాంటి అనుభవం మీకు గానీ.. మీకు తెలిసినవారికి గానీ ఎదురైతే దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరొకరు మీ ఓటు వేసినా.. మళ్లీ మీకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. అదే టెండర్ ఓటు అంటారు. ఈ అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. అయితే.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అవకాశం కల్పిస్తారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు ఫారం-17బీ లో రికార్డు చేస్తారు. ఈ ఫారంలోని ఐదవ కాలమ్‌లో ఓటరు సంతకం లేదంటే వేలిముద్రను తీసుకున్న తార్వాత బ్యాలెట్ పత్రం అందజేస్తారు.
ఆ విధంగా ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లోకి ఓటరు బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి.. తమకు నచ్చిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటు ఎవరికి వేశారో బయటకు తెలియకుండా మడిచి బ్యాలెట్ పత్రాన్ని మడిచి కంపార్ట్‌మెంట్ బయటకు వచ్చి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్ పత్రాన్ని టెండర్ ఓటుగా ప్రిసైడింగ్ అధికారి మార్క్ చేసి ప్రత్యేక ఎన్వలప్‌లో వేరుగా ఉంచుతారు. ఈ విధంగా మరొకరు మీ ఓటు హక్కుని కాలరాసినా.. అక్కడే మీ ఓటును వినియోగించుకునే హక్కు ఎన్నికల కమిషన్ కల్పించింది.