మంత్రి గంగుల కమలాకర్ వాహనంలో పోలీసుల తనిఖీలు (వీడియో)
మంత్రి గంగలు కమలాకర్ వాహనాన్ని ఎన్నికల అధికారులు, పోలీసులు కొదురుపాక వద్ద అడ్డుకున్నారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 12:18 PM ISTమంత్రి గంగుల కమలాకర్ వాహనంలో పోలీసుల తనిఖీలు (వీడియో)
తెలంగాణలో ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారంలో ముమ్మురంగా పాల్గొంటున్నారు నాయకులు. మరోవైపు ఎన్నికల అధికారులు ఈ సారి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దాంతో.. పోలీసులు ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా నగదు.. బంగారం, మద్యం వంటికి తరలిస్తే వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కరీనంగర్ నుంచి సిరిసిల్లకు వెళ్తున్న మంత్రి గంగుల కమలాకర్ వాహనాన్ని కూడా ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.
మంత్రి గంగలు కమలాకర్ వాహనాన్ని ఎన్నికల అధికారులు, పోలీసులు కొదురుపాక వద్ద అడ్డుకున్నారు. కరీంనగర్ నుంచి మంత్రి గంగుల సిరిసిల్లకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మంత్రి గంగులతో పాటు వాహనంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కే.కేశవరావుతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఉన్నారు. అయితే.. ఎన్నికల అధికారులు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహనాలను తనిఖీ చేయాలని చెప్పారు. దానికి మంత్రి గంగుల తోపాటు కేకే, వినోద్ సహకరించారు. దాంతో.. పోలీసులు మంత్రి గంగుల వాహనంలో తనిఖీలు చేశారు. కారులోని బ్యాగులతో పాటు ఇతర వస్తువులను పోలీసులు తనిఖీ చేసారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ, నగదు గానీ గంగుల కారులో లభించలేదు. దీంతో తనిఖీలు ముగిసిన తర్వాత నాయకులు సిరిసిల్లకు పయనమయ్యారు.
తనిఖీలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలంగాణకు పొరుగున వున్న రాష్ట్రాల బార్డర్ల వద్దే కాదు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఎవరైనా డబ్బు, బంగారం, మద్యం ఇలా అక్రమంగా సరఫరా చేసి ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కాగా.. ఇప్పటికే పోలీసుల వాహన తనిఖీల్లో అక్కడక్కడ భారీగా నగదు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరక్కుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.