సంగారెడ్డి: పోలింగ్ బూత్‌ సెంటర్‌లో గుండెపోటుతో వ్యక్తి మృతి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  30 Nov 2023 2:22 PM IST
telangana elections, man dead,  polling booth, sangareddy,

 సంగారెడ్డి: పోలింగ్ బూత్‌ సెంటర్‌లో గుండెపోటుతో వ్యక్తి మృతి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒక వైపు పోలింగ్‌ జరుగుతుంటే మరోవైపు విధి నిర్వహణలో భాగంగా పోలింగ్‌ బూత్‌లో కూర్చొన్న వ్యక్తి గుండె నొప్పితో మృతిచెందాడు. దాంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ పోలింగ్‌ బూత్‌ నెంబర్ 248లో ఈ సంఘటన జరిగింది. సుధాకర్‌ అనే వ్యక్తి పోలింగ్ సిబ్బందిగా కేటాయించారు ఎన్నికల సంఘం అధికారులు. గురువారం తెల్లవారుజామునే పోలింగ్‌ బూత్‌ సెంటర్‌లో ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు సిబ్బంది. ఆ సమయంలోనే సుధాకర్‌కు గుండెలో నొప్పి వచ్చింది. దాంతో.. అక్కడి ఉన్న మిగతావారికి ఈ విషయం చెబతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత స్పృహ కోల్పోయాడు.

సుధాకర్‌ ఒక్కసారిగా కిందపడిపోవడం.. గుండె నొప్పి అని చెప్పడంతో అక్కడున్న మిగతా ఎన్నికల సిబ్బంది ఆందోళన చెందారు. వెంటనే అయన్ని సమీపంలో ఉన్న పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. అప్పటికే సుధాకర్ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. సుధాకర్‌ చనిపోయిన విషయాన్ని పోలింగ్‌ సిబ్బంది అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. సుధాకర్‌ డెడ్‌బాడీని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలింగ్‌ విధుల్లో పాల్గొన్న ఉద్యోగి మరణించడంతో మిగతా సిబ్బంది కన్నీటి పర్యంతం అయ్యారు. ఎంతో ఉత్సాహంగా పోలింగ్‌ విధుల్లో పాల్గొన్న సుధాకర్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందడం అతని కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది.

Next Story