అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల అమలు: మల్లికార్జున ఖర్గే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 8:53 AM GMTఅధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల అమలు: మల్లికార్జున ఖర్గే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆరు గ్యారెంటీలతో పాటు 36 అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లికార్జున ఖర్గే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మల్లికార్జున ఖర్గే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని ఓటర్లు నిర్ణయించుకున్నారని చెప్పారు. అయితే.. కర్ణాటకలో ఇచ్చిన హామీ మేరకు ఐదు గ్యారెంటీలను వెంటనే అమలు చేసి చూపిస్తున్నామని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అలాగే తెలంగాణలోనూ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తామని ప్రకటించారు. తొలి కేబినెట్ సమావేశంలోనే వాటికి ఆమోదం తెలుపుతామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయడం పక్కా అని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్ సర్కార్‌పై వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు ఖర్గే. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ పరస్పర విమర్శలు మానేశారని.. అలా ఎందుకు అవుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. కేసీఆర్‌కు పదవీ విరమణ సమయం వచ్చేసిందన్నారు ఖర్గే. కేసీఆర్‌కు కూడా తమకు ఓటమి తప్పదని అర్థం అయ్యిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. మోదీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ఖర్గే చెప్పారు. విద్యార్థుల బలిదానాలను చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని మల్లికార్జున ఖర్గే చెప్పారు. జనాలు బాగుపడతారని తెలంగాణ ఇస్తే.. జనాలను దోచుకునేవారు రాజ్యమేలుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు, పథకాలు.. ఇలా ప్రతిదాంట్లో అవినీతి జరుగుతోందన్నారు.