ఎవరు ఎవరికి అన్యాయం చేశారు..? తుమ్మలపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

తెలంగాణలో మరోసారి అధికారం చేపట్టేందుకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్‌ దూసుకెళ్తోంది.

By Srikanth Gundamalla  Published on  27 Oct 2023 11:45 AM GMT
telangana elections, brs meeting, cm kcr,   thummala,

ఎవరు ఎవరికి అన్యాయం చేశారు..? తుమ్మలపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

తెలంగాణలో మరోసారి అధికారం చేపట్టేందుకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్‌ దూసుకెళ్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలోని పాలేరులో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌కు తుమ్మల నాగేశ్వరరావు అన్యాయం చేశారా..? తుమ్మలకు బీఆర్ఎస్‌ అన్యాయం చేసిందా ప్రజలే చెప్పాలని అన్నారు సీఎం కేసీఆర్.

పువ్వాడ అజయ్‌ చేతిలో తుమ్మల ఓడిపోయి కూర్చొని ఉంటే తానే బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించానని సీఎం కేసీఆర్ చెప్పారు. అంతేకాదు.. ఎమ్మెల్సీని ఇచ్చి కేబినెట్‌లో హోదా కల్పించామన్నారు. ఆ తర్వాత పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణిస్తే ఉపఎన్నికలు వచ్చాయి. దాంతో.. తుమ్మలకు అవకాశం ఇవ్వడంతో గెలింపించుకున్నామని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. అయితే.. ఐదేళ్ల పాటు ఖమ్మం జిల్లాను తుమ్మలకు అప్పగిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. ఐదేళ్లలో ఖమ్మంకు తుమ్మల నాగేశ్వరరావు చేసింది గుండు సున్నా అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

బీఆర్ఎస్‌పై తుమ్మల నాగేశ్వరావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ అన్యాయం చేసిందని అంటున్నారని చెప్పారు. పూటకో మార్టీ మారే వాళ్లను నమ్మొద్దని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. అవకాశాల కోసం పార్టీ మారే వారికి ఓటు వేయొద్దని చెప్పారు. అలాగే డబ్బుల కట్టల అహంకారంతోనూ వచ్చే వారిని దూరం పెట్టాలని కోరారు. పదవుల కోసం పార్టీ మారే వారు మనమధ్యలోనే ఉన్నారంటూ తుమ్మల నాగేశ్వరావుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అలాంటి వారికి ఈసారి ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఇక గత పాలకులకు ప్రజలకు మంచినీళ్లు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు సీఎం కేసీఆర్. గతంలో తెలంగాణలో భూముల ధరలు ఎలా ఉండేవి..? ఇప్పుడెలా ఉన్నాయో ఒకసారి బేరీజు వేసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. రైతుబంధును తీసుకొచ్చింది కేసీఆరే అని.. రాష్ట్ర సంపద పెరుగుతున్న కొద్ది సంక్షేమ పథకాలను పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. గతంలో ఏ ఒక్క పాలకుడు కూడా రైతులకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. రైతుబంధు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్‌ అని.. రైతుబంధు ఉండాలో వద్దో ప్రజలు నిర్ణయించాలని చెప్పారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్‌ సరిపోతుందని చెబుతున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే గోసలు తప్పవంటూ సీఎం కేసీఆర్ చెప్పారు.

Next Story