Telangana: అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఎంపీ ధర్మపురి అర్వింద్..!
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 11:05 AM ISTTelangana: అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఎంపీ ధర్మపురి అర్వింద్..!
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దాంతో.. ప్రధాన పార్టీలు ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్తులను ప్రకటించింది. ఇక అధినేత సీఎం కేసీఆర్ సభలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల అయ్యింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. గెలిచే వారిని బరిలో నిలబెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలను కూడా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పరిధుల్లో ఉన్న ఏదో ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాల్సిందేనని ఆదేశించినట్లు తెలుస్తోంది. దాంతో.. తమకు అనుకూలమైన స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీలో ఉన్న ఆయా ఎంపీలు సమయాత్తం అవుతున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది.
బీజేపీ అధిష్టానం ఆదేశంతో ఎంపీ అర్వింద్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే.. కోరుట్ల నియోజకవర్గంలో ఎంపీ సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్‌లో జరిగిన బహరింగ సభలో నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో ఏళ్ల క్రితమే మూతపడ్డ షూగర్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ, అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లాలని, త్వరలో పునః ప్రారంభించేలా చూస్తానన్న హామీతో ఓట్లు అడిగేందుకు అర్వింద్ సమయాత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. కోరుట్లలో చెరుకు పండించే రైతులు అధికంగా ఉంటారు. దాంతో.. ఓటర్లు తనవైపు మొగ్గుచూపుతారనే భావనలో ఉన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్.
అటు పసుపుబోర్డు, ఇటు షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం అంశం ఎన్నికల్లో కలిసి వస్తుందని అర్వింద్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. గతంలో మెట్‌పల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పాటుబడ్డారు. దాంతో.. బీజేపీకి క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ పరిస్థితులు అన్నీ బీజేపీ గెలుపునకు సాయం చేస్తాయని.. నిజామాబాద్‌లోని ఆర్మూర్ నియోజకవర్గంతో పోలిస్తే కోరుట్లనే బెటర్ అని.. విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయని ఎంపీ అర్వింద్ యోచిస్తున్నారని సమాచారం.