సీఎంగా ఏఐసీసీ ఎవరిని ఎంపిక చేసినా నాకు ఆమోదమే: ఉత్తమ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెజారిటీ సీట్లు గెలిచింది.

By Srikanth Gundamalla  Published on  5 Dec 2023 1:24 PM IST
telangana congress, utham , aicc, cm candidate,

సీఎంగా ఏఐసీసీ ఎవరిని ఎంపిక చేసినా నాకు ఆమోదమే: ఉత్తమ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెజారిటీ సీట్లు గెలిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఆ పార్టీలో సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై అధిష్టానం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకూ అందరిలోనూ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేలంతా తమ అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్‌కు చెప్పారు. ఇక కాంగ్రెస్‌ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఒకే అన్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్టానానికి చెప్పనున్నారు డీకే శివకుమార్.

అయితే.. ఢిల్లీకి డీకే శివకుమార్‌, ఠాక్రేతో పాటు ఉత్తమ్‌కుమార్‌, భట్టి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వారు కూడా సీఎం పదవిని కోరుకుంటున్నారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఢిల్లీలో డీకే శికుమార్‌తో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. సీఎం అభ్యర్థిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక ఏఐసీసీ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే ఖరారు చేస్తారని ఉత్తమ్‌ చెప్పారు. తాను కూడా అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని అన్నారు. ఏఐసీసీ అధిష్టానం సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా కూడా తనకు ఆమోదమే అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలంతా కూడా ఇదే విషయంపై ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశామని చెప్పారు. మరోవైపు తాను ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా.. ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఎంపీ పదవికి రాజీనామా ఎప్పుడు చేస్తాననేది త్వరలో నిర్ణయం తీసుకుని వెల్లడిస్తానని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వెల్లడించారు.

తెలంగాణ సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. అయితే.. ఈ సాయంత్రానికి కల్లా సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరి పేరును ప్రకటిస్తారని ఉత్కంఠ నెలకొంది.

Next Story