Telangana: బస్సుల్లో రద్దీని తగ్గించేందుకు చర్యలు: మంత్రి పొన్నం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చారు.
By Srikanth Gundamalla Published on 21 July 2024 5:28 AM GMTTelangana: బస్సుల్లో రద్దీని తగ్గించేందుకు చర్యలు: మంత్రి పొన్నం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ సదుపాయంతో బస్సుల్లో రద్దీ మరింత పెరిగింది. దాంతో.. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ పెరడగంతో కనీసం నిలబడేందుకు కూడా చోటు దొరకడం లేదు. ఫుల్ ఆక్యుపెన్సీ కారణంగా కొన్ని స్టాపుల్లో బస్సులు నిలపడం లేదు. ఈ క్రమంలోనే బస్సు ప్రయాణాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి బస్సుల్లో ప్రయాణికులు హాయి గా కూర్చొని వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ బస్ భవన్‌లో శనివారం టీజీఎస్ఆర్టీసీ పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం అయ్యారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం అమలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్థికపరమైన అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మాట్లాడిన మంత్రి పొన్నం.. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఇప్పుడున్న సర్వీసుల కంటే మెరుగైన రవాణా సౌకర్యాలను ప్రయాణికులకు కల్పించాలని అధికారులకు సూచించారు. సంస్థలోని ప్రతి ఒక్క సిబ్బంది నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పని చేస్తుండటం వల్లే మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలవుతోందని ప్రశంసించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సంస్థలో 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మంత్రి పొన్నం గుర్తుచేశారు. ఈ పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని వెల్లడించారు.