సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. తప్పిన ప్రమాదం
సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 9:16 AM GMTసీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. తప్పిన ప్రమాదం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా వరుసగా ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తో బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ప్రజా ఆశీర్వాద సభలు రోజు రెండు, మూడు నిర్వహిస్తున్నారు. దాంతో.. హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనల్లో బిజీ అవుతున్నారు. అయితే.. తాజాగా సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, గద్వాల నియోజకవర్గాల్లోని ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ఇవాళ పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్‌లో బయల్దేరారు సీఎం కేసీఆర్. చాపర్ టేకాఫ్ అయిన కాసేపటికే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించాడు. వెంటనే అప్రమత్తం అయ్యి.. హెలికాపర్‌టను సురక్షితంగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
అయితే.. సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య వచ్చిందన్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందారు. చివరకు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. హెలికాప్టర్ సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యిందని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. సీఎం కేసీఆర్ పర్యటన కోసం అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. మరో హెలికాప్టర్‌లో కేసీఆర్ ప్రచార సభలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.