రంగారెడ్డి: కుప్పకూలిన నిర్మాణంలోని స్టేడియం స్లాబ్.. ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్‌ స్టేడియం స్లాబ్‌ ఒక్కసారిగా కుప్పకూలింది.

By Srikanth Gundamalla  Published on  20 Nov 2023 9:42 AM GMT
stadium slab, collapse, three dead ,  moinabad,

 రంగారెడ్డి: కుప్పకూలిన నిర్మాణంలోని స్టేడియం స్లాబ్.. ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కనకమాడిలో నిర్మిస్తున్న ఇండోర్‌ స్టేడియం స్లాబ్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. స్లాబ్‌ ఒక్కసారిగా మీదపడటంతో దుర్మరణం చెందారు. మరో పది మందికి గాయాలు అయినట్లు సమాచారం. ఈ సంఘటన గురించి సమాచారం అందుకు అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

అధునాతన టెక్నాలజీతో ఇండోర్‌ స్టేడియం నిర్మాణం చేపట్టారు. ఒకే పిల్లర్‌పై కొత్త టెక్నాజీతో ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు కాంట్రాక్టర్‌ ప్రయత్నం చేశారు. కానీ.. నిర్మాణం జరుగుతున్న సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదం జరిగింది. స్లాబ్‌ వేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలింది. స్లాబ్‌ కూలిన సమయంలో ఘటనాస్థలిలో దాదాపు 20 మంది వరకు పనిచేస్తున్నారని తెలుస్తోంది. స్లాబ్‌ కూలుతుందని గ్రహించిన కొందరు అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంకొందరు మాత్రం అలర్ట్‌ అయ్యి పారిపోయే లోపే ప్రమాదం ముంచుకొచ్చింది. స్లాబ్‌ కూలి వారిపై పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఇప్పటి వరకు అయితే ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇక ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా సహాయ చర్యల్లో పాల్గొంటుంది. జేసీబీల సాయంతో శిథిలాలను తొలగించే ప్రయత్నాలు చేస్తోంది రెస్క్యూ టీమ్. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా కొందరు ఉండిఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story