దేశంలోనే అత్యంత పొడవైనదిగా ఉప్పల్‌ స్కైవాక్‌ రికార్డు

ఉప్పల్ స్కై వాక్ ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత పొడవైన స్కైవాక్‌గా రికార్డు సృష్టించింది.

By Srikanth Gundamalla
Published on : 26 Jun 2023 2:02 PM IST

Skywalk, Uppal, Telangana, Largest Skywalk

దేశంలోనే అత్యంత పొడవైనదిగా ఉప్పల్‌ స్కైవాక్‌ రికార్డు

ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుతోంది. టెక్నాలజీ కూడా పెరుగుతోంది. అయితే.. కొన్ని నగరాల్లో అయితే జనసాంద్రత మరింత ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఈ క్రమంలోనే వాహనాలు పెద్ద సంఖ్యలో ఉంది ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుంది. అంతేకాదు.. రోడ్డు ప్రమాదాలూ జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే రోడ్లను ఈజీగా దాటేందుకు స్కైవాక్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఇవి చాలా ఏళ్ల క్రితం నుంచే ఉన్నా.. తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటైన ఉప్పల్‌ స్కైవేకు మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే దేశంలోనే అత్యంత పొడవైన స్కైవాక్‌ ఇదే.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పొడవున్న అద్దంతో ఉన్న వంతెన చైనాలోని క్వింగ్యువాన్ లోయలో ఉంది. దీన్ని చూసేందుకు ఎంతో మంది పర్యాటకులు ఉత్సాహం చూపిస్తారు. కానీ ఒక్కసారి దీనిపై అడుగు పెడితే.. భయంతో కాలు ముందుకు వేయాలంటేనే వణికిపోతారు. ఈ వంతెన 202 మీటర్ల పొడువుతో నిర్మించారు. ఈ వంతెన చివరన వృత్తాకార డెక్‌ను 16.8 మీటర్ల వ్యాసంతో నిర్మించారు. ఈ బ్రిడ్జి అద్దం నుంచి సూర్యరశ్మి దాదాపు 99 శాతం కిందవైపు పడుతుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అద్దం నుంచి కింద క్లియర్‌గా కనిపిస్తోంది అనేది. క్వింగ్యువాన్‌ బ్రిడ్జిపై నుంచి చూస్తే 131 మీటర్ల ఎత్తుఐన జలపాతం దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. చైనాతో పాటు మరికొన్ని దేశాల్లోనూ పేరుగాంచిన స్కైవాక్‌లు చాలానే ఉన్నాయి.

గ్లాస్‌ స్కై వాక్‌లపై నడవాలని చాలా మంది కలలు కంటారు. ఉత్సాహం కనబరుస్తారు. మనదేశంలోనే గ్లాస్‌ స్కైవాక్‌ ఒకటి ఉంది. సిక్కింలోని పెల్లింగ్లో అద్భుతమైన స్కైవాక్‌ను నిర్మించారు. హిమాలయాల మధ్య 137 అడుగుల చెన్‌రెజిగ్ విగ్రహానికి ఎదురుగా ఉంది ఈ బ్రిడ్జి. ఇండియాలోనే గ్లాస్‌తో నిర్మితమైన మొట్టమొదటి స్కైవాక్‌ ఇదే. చెన్‌రిజిగ్‌ విగ్రహాన్ని ఈ బ్రిడ్జిపై నుంచి వెళ్లి చూడొచ్చు. ఇక్కడి నుంచి వీక్షణ అద్భుతంగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తైన పర్వతాల మధ్యన ఉండటంతో మూర్ఛవ్యాధి ఉన్నవారికి ఈ వంతెనపైకి అనుమతి ఇవ్వరు. హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.

మహారాష్ట్రలోని అమరావతికి దగ్గర ఉన్న చిఖల్‌దారా అనే హిల్‌ స్టేషన్‌లో అతిపెద్ద స్కైవాక్‌ నిర్మాణం అవుతోంది. కోట్ల రూపాయలతో ఈ స్కైవాక్‌ను నిర్మిస్తున్నారు. 570 మీటర్ల పొడవు.. 4.2 మీటర్ల వెడెల్పుతో ఈ స్కైవాక్‌ నిర్మాణం జరుగుతోంది. ఈ ఏడాదిలోనే చిఖల్‌దారా హిల్‌స్టేషన్‌ ప్రారంభించే అవకాశాలూ ఉన్నాయి. మొల్ఘాట్‌ టైగర్‌ రిజర్వ్‌ యొక్క బఫర్‌ జోన్‌ మీదుగా చిఖల్‌దారా స్కైవాక్‌ను నిర్మిస్తున్నారు. ఇక ముంబైలోనూ పాదాచారుల కోసం చాలా స్కైవాక్‌లు ఉన్నాయి. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో 36 స్కైవాక్‌లు ఉన్నాయి. రోజూ చాలా మంది నగరవాసులు ఈ స్కైవాక్‌లను ఉపయోగించి సేఫ్‌గా రోడ్లను దాటుతున్నారు.

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్కైవేకు కూడా ఎన్నో ప్రాధాన్యతలు ఉన్నాయి. దీన్ని మంత్రి కేటీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఉప్పల్ స్కై వాక్ ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత పొడవైన స్కైవాక్‌గా రికార్డు సృష్టించింది. 660 మీటర్ల పొడవుతో రూ. 25 కోట్లతో స్కై వాక్‌ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కిలేటర్లు అందుబాటులో ఉంటాయి. కనువిందు చేసే లైంటింగ్ నిర్మాణం వావ్ అనిపిస్తోంది. స్కై వాక్ పై నియంత్రణ నిఘా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నాయి. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇరువైపులా రక్షణ కోసం రెయిలింగ్‌ను నిర్మించారు. రాబోయే వంద సంవత్సరాలకు పైగా ఉపయోగపడేలా ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సుమారు వెయ్యి టన్నులకుపైగా స్ట్రక్చరల్ స్టీల్ వాడారు.

2020 ఏడాది చివర్లో ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు పనులు మొదలైనప్పటికీ వరుసగా రెండు సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితుల కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. ఉప్పల్ చౌరస్తాలో నలువైపులా ప్రతినిత్యం సుమారు 20 వేలమందికిపైగా పాదచారులు రోడ్డు దాటుతుంటారు. ఉప్పల్ స్కై వాక్ అందుబాటులోకి రావడంతో.. ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ గా వాహనాల రాకపోకలకు అవకాశం లభించినట్లయింది. పాదాచారులు కూడా ఈజీగా రోడ్డుని క్రాస్‌ చేస్తున్నారు.

Next Story