Sangareddy: కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు, ఐదుగురు మృతి

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌ గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  3 April 2024 8:01 PM IST
sangareddy, reactor blast,  chemical company, several dead ,

Sangareddy: కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు, ఐదుగురు మృతి

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌ గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్‌బీ ఆర్గానిక్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ శబ్ధంతో రియాక్టర్‌ పేలిపోయింది. ఈ పేలుడు సంఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. స్థానిక ప్రజలంతా ఒక్క సారిగా పెద్ద శబ్ధం రావడంతో భయంతో వణికిపోయారు. అయితే.. ఈ రియాక్టర్‌ పేలిన ప్రమాదంలో కంపెనీలో పనిచేస్తోన్న మేనేజర్ రవితో పాటుగా మరో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు.

ఇదే సంఘటనలో రియాక్టర్ పేలుడు దాటికి కంపెనీలో ఉన్న మరో 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేశారు ఫైర్ సిబ్బంది. అయితే.. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. రియాక్టర్‌ పేలుడుతో కార్మికుల మృతదేహాలు దాదాపు వందల మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయని వెల్లడించారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామనీ వారు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు పోలీసులు. అయితే.. వీరిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

దాంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రియాక్టర్ పేలిన సమయంలో కంపెనీలో 50 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వారు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. ఒక రియాక్టర్ నుంచి మరో రియాక్టర్‌కు మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఒకే రియాక్టర్‌ పేలిందనీ.. ఇంకో రియాక్టర్ పేలి ఉంటే తీవ్రత మరింత రెట్టింపు అయ్యేదని పోలీసులు అంటున్నారు. ఇక ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. గాయపడ్డ వారికి సంగారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Next Story