Telangana Polls: గీత కార్మికులకు లూనాలు: మంత్రి హరీశ్‌రావు

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  23 Nov 2023 3:52 PM IST
sangareddy, minister harish rao, election campaign,

Telangana Polls: త్వరలో గీత కార్మికులకు లూనాలు: మంత్రి హరీశ్‌రావు

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం ఇప్పటికే మేనిఫెస్టోలు ప్రకటించాయి. అంతేకాదు.. ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థులు కూడా తాము స్థానికంగా ఎలాంటి పనులు చేస్తామో చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మొత్తం ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు బీఆర్ఎస్‌ చూస్తుంటే.. ఎలాగైనా ఈసారి తాము అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. తాజాగా బీఆర్‌ఎస్‌ మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు మంత్రి హరీశ్‌రావు.

కేసీఆర్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పారు హరీశ్‌రావు. గతంలో కాంగ్రెస్‌ 50 ఏళ్లలో చేయలేని పనులను తాము తొమ్మిదిన్నరేళ్లలో చేసి చూపించామని చెప్పారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ సీఎం కావాలని.. బీఆర్ఎస్‌ ప్రభుత్వం తోనే సాధ్యమని చెప్పారు. అయితే.. అన్ని వర్గాల్లానే గౌడ కులస్తులకు కేసీఆర్ అండగా నిలిచారని చెప్పారు. తాటిచెట్టుకు పన్ను రద్దు చేశామని చెప్పారు. కాంగ్రెస్హయాంలో నెలా నెలా మామూళ్లు కట్టాల్సి వచ్చేదని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. అయినా.. కల్లు డిపోల వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదన్నారు. మరోసారి కేసీఆర్ సర్కార్‌ రావాలని అందరూ కోరుకోవాలని.. సంగారెడ్డిలో బీఆర్ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు.

రాబోయే రోజుల్లో కేసీఆర్ గీత కార్మికుల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనున్నారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. గీత కార్మికులకు రాబోయే రోజుల్లో లూనాలు ఇప్పించే ఆలోచన చేస్తున్నారని వెల్లడించారు. సంగారెడ్డిలో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నియోజకవర్గానికి పెద్దగా చేసిందేమీ లేదన్నారు. సంగారెడ్డిలో గెలిచి ఎప్పుడూ హైదరాబాద్‌లోనే తిరుగుతారని విమర్శించారు. కానీ.. గత ఎన్నికల్లో ఓటమిని చూసిన చింతా ప్రభాకర్‌ మాత్రం ప్రజల్లోనే ఉన్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. అలాగే ట్యాంక్‌ బండ్‌పై రూ.3 కోట్లతో సర్దార్‌ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. గౌడ్‌లకు బీఆర్ఎస్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందనీ.. శ్రీనివాస్‌గౌడ్, స్వామిగౌడ్‌లకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్‌ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అందుకే బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని గీత కార్మికులకు మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

Next Story