రూ.10లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన శామీర్‌పేట్‌ తహశీల్దార్

మేడ్చల్‌ జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కారు.

By Srikanth Gundamalla
Published on : 13 Feb 2024 4:02 PM IST

Sameerpet Tahsildar caught taking Rs.10 lakh bribe

రూ.10లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన శామీర్‌పేట్‌ తహశీల్దార్

మేడ్చల్‌ జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కారు. ప్రభుత్వ ఉద్యోగం... మంచి జీతం ఉన్నా లంచాలు తీసుకుంటున్నారు కొందరు అవినీతి పరులు. ఏసీబీ అధికారుల చేతికి వరుసగా ఎంతమంది చిక్కి కటకటాల పాలవుతున్నా మార్పు రావడం లేదు. తాజాగా మరో తహశీల్దార్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటంతో కలకలం రేపింది.

మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్‌ తహశీల్దార్‌గా సత్యనారాయణ పనిచేస్తున్నారు. రామశేష గిరిరావు అనే వ్యక్తి భూమికి సంబంధించిన పట్టాపాస్‌ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే.. ఆ ఫైల్‌ను కలెక్టర్‌కు పంపాల్సి ఉంది. దాన్ని కలెక్టర్‌ వద్దకు పంపాలంటే తనకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఏకంగా రూ.10 లక్షలు ఇస్తేనే కలెక్టర్‌కు పంపిస్తానని లేదంటే లేదని చెప్పాడు. సదురు వ్యక్తి తాను అన్ని డబ్బులు ఇచ్చుకోలేనని చెప్పినా వినలేదు. 10 లక్షల రూపాయలు ఇస్తేనే పని జరుగుతుందని తహశీల్దార్‌ సత్యనారాయణ తెగేసి చెప్పాడు. ఇక గత్యంతరం లేక ఆ వ్యక్తి రూ.10 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు.

కానీ.. సదురు వ్యక్తికి లంచం ఇవ్వడం ఏమాత్రం నచ్చలేదు. దాంతో... ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. జరిగిన విషయం అంతా చెప్పాడు. దాంతో.. ఏసీబీ అధికారులు ఆపరేషన్ మొదలుపెట్టారు. మంగళవారం మధ్యాహ్నం తహసీల్దార్‌ ఆఫీస్‌కు వెళ్లారు. కాపలా కాశారు. ఒంటి గంట సమయంలో బాధితుడి వద్ద తహసీల్దార్‌ సత్యనారాయణ డ్రైవర్‌ భద్రి డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తన యజమాని చెప్పడంతోనే డబ్బులు తీసకుంటున్నట్లు భద్రి ఒప్పుకున్నాడు. దాంతో.. ఏసీబీ అధికారు తహశీల్దార్‌ సత్యనారాయణ సహా అతని డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. శామీర్‌పేట్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో తనిఖీలు చేశారు.


Next Story