తెలంగాణలో రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకునే రైతులకు ప్రభుత్వ అధికారులు పలు సూచనలు చేశారు. రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తోందని తెలిపారు. ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పిస్తోన్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోని 18 నుంచి 59 ఏండ్ల వయసు గల రైతులు ఏఈవోకు దరఖాస్తులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. ఈ నెల 28 వరకు పట్టాదారు పాస్‌బుక్ వచ్చిన రైతులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
అర్హులైన రైతులు తగిన పత్రాలు సమర్పించి వ్యవసాయ విస్తరణాధికారుల సమక్షంలో వేలిముద్రలు వేయాలని సూచించారు. అర్హులైన రైతులు పట్టాదార్ పాస్‌బుక్ లేదా డిజిటల్ సంతకం చేసిన డీఎస్ పేపర్, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. గతంలో బీమా గల రైతులు నమోదుపత్రంలో అవసరమైన మార్పులు, చేర్పులకు ఈనెల 30లోపు సవరణ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రైతుబీమాకు అర్హత వయసును ఆధార్‌కార్డు మీద ముద్రించిన పుట్టిన తేదీ ఆధారంగా మాత్రమే పరిగణిస్తామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.