మద్యం తక్కువ ధరకు అమ్మితే రూ.4లక్షల జరిమానా: ఆబ్కారీశాఖ
ఈ నెల 30వ తేదీతోనే ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ పాలసీ విధానం ముగియనుంది.
By Srikanth Gundamalla Published on 27 Nov 2023 6:56 AM ISTమద్యం తక్కువ ధరకు అమ్మితే రూ.4లక్షల జరిమానా: ఆబ్కారీశాఖ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండ్రోజుల సమయం మాత్రమే ఉంది. రేపటితో ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలోనే ప్రచారం పీక్స్‌కు చేరుకోనుంది. ప్రధాన పార్టీల నాయకులంతా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఇలా పోలింగ్ సమయం దగ్గరపడుతుంటే.. మరోవైపు ఎక్సైజ్ పాలసీ విధనం గడువు కూడా పూర్తవనుంది. ఈ నెల 30వ తేదీతోనే ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ పాలసీ విధానం ముగియనుంది. ఈ క్రమంలో మద్యం దుకాణాదారులు తమ వద్ద ఉన్న సరుకును మొత్తం అమ్మేయాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ 28 నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపేయాల్సి ఉంటుంది. మద్యం దుకాణాలకు సెలవులు ఉన్న కారణంగా పూర్తి సరుకు అమ్ముడు పోతుందో లేదో అని మద్యం విక్రయదారులు కాస్త ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక ఆదేశాలు జరీ చేసింది. మద్యం విక్రయాలపై ఆబ్కారీ శాఖ దృష్టి సారించింది. స్వల్ప వ్యవధిలో తమ వద్ద ఉన్న నిల్వలను ఖాళ చేయడానికి వ్యాపారులు ఎమ్మార్పీ ధరకంటే తక్కువ ధరకు మద్యం విక్రయిస్తారన్న ఉద్దేశంతో ఆబ్కారీ శాఖ నిఘా పెంచిది. ఎమ్మార్పీ ధరకంటే తక్కువ ధరకు మద్యం విక్రయించకూడదని ఆబ్కారీ శాఖ కమిషనర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం.. ఎమ్మార్పీ కంటే తక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు జరిమానా విధించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఇలా చేసినట్లు నేరం రుజువు అయితే 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుందని మద్యం వ్యాపారులకు ఆబ్కారీశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
ఎన్నికలు ముగింపు దశకావడంతో మద్యం ఏరులైపారే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు మద్యం వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకును ఈ నెల 27వ తేదీతో పాటు తిరిగి 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే విక్రయించేందుకు సమయం ఉంది. పెద్ద ఎత్తున విక్రయాలు జరిగితేనే పూర్తి నిల్వలు ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2620 మద్యం దుకాణాలున్నాయి. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 28 నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపేయాల్సి ఉంటుంది. ఇక డిసెంబరు 1 నుంచి కొత్త లైసెన్స్‌దారులు విక్రయాలు ప్రారంభించనున్నారు.